న్యూఢిల్లీ, అక్టోబర్ 13 : నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు భారీగా పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ.11.89 లక్షల కోట్ల మేర వసూలయ్యాయి. క్రితం ఏడాది ఇదే సమయంలో వసూలైన రూ.11.18 లక్షల కోట్లతో పోలిస్తే 6.33 శాతం వృద్ధిని కనబరిచాయి. కార్పొరేట్ ట్యాక్స్ వసూళ్లు అధికంగా ఉండటం, మరోవైపు రిఫండ్లు తగ్గుముఖం పట్టడం వల్లనే పన్ను వసూళ్లు అధికమయ్యాయని తెలిపింది.
ఏప్రిల్ 1 నుంచి అక్టోబర్ 12 వరకు రిఫండ్ 16 శాతం తగ్గి రూ.2.03 లక్షల కోట్లకు పరిమితమయ్యాయి. అలాగే నికర కార్పొరేట్ ట్యాక్స్ వసూళ్లు రూ.4.92 లక్షల కోట్ల నుంచి రూ.5.02 లక్షల కోట్లకు చేరుకోగా, కార్పొరేటేతర పన్ను వసూళ్లు రూ.6.56 లక్షల కోట్లకు చేరుకున్నాయి. అలాగే సెక్యూరిటీస్ ట్రాన్సక్షన్ ట్యాక్స్ వసూళ్లు కూడా రూ.30,630 కోట్ల నుంచి రూ.30,878 కోట్లకు చేరాయి.