Nirmala Sitharaman | ముంబై, జూలై 28: దేశీయ కంపెనీలు ఇకనుంచి విదేశీ స్టాక్ ఎక్సేంజీల్లో నేరుగా లిస్ట్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దేశీయ లిస్టెడ్, అన్‌లిస్టెడ్ కంపెనీలు విదేశీ ఎక్సేంజీలతో పాటు అహ్మదాబాద్‌లోని ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ (ఐఎఫ్ఎస్సీ)లో లిస్టింగ్‌కు వీలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. దీంతో కంపెనీలకు అంతర్జాతీయ మూలధనం అందుబాటులోకి వస్తుందని మెరుగైన విలువ లభిస్తుందని మంత్రి వివరించారు. వాస్తవానికి 2020 మే నెలలో ప్రకటించిన కోవిడ్ రిలీఫ్ ప్యాకేజీలో భాగంగా విదేశీ లిస్టింగ్‌కు ప్రభుత్వం ఆమోదం తెలిపినప్పటికీ, ఈ అంశాన్ని ఇప్పటివరకూ నోటీఫై చేయలేదు. వచ్చే కొద్ది వారాల్లో నోటీఫై చేయనున్నట్టు కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. తొలుత ఐఎఫ్ఎస్సీలో లిస్ట్ చేసుకునేందుకు భారతీయ కంపెనీలను అనుమతిస్తారని, అటుతర్వాత ఎంపికచేసిన ఏడు లేదా ఎనిమిది విదేశాల్లో లిస్టింగ్‌కు వీలు కల్పిస్తారన్నది సమాచారం.
ప్రస్తుతం దేశీయ లిస్టెడ్ కంపెనీలు అమెరికన్ డిపాజిటరీ రీసీట్స్ (ఏడీఆర్‌లు), గ్లోబల్ డిపాజిటరీ రీసీట్స్ (జీడీఆర్‌లు) ద్వారా విదేశాల్లో లిస్ట్ అవుతున్నాయి. ఇన్ఫోసిస్, విప్రో, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్‌ల ఏడీఆర్‌లు యూఎస్ మార్కెట్లో లిస్ట్‌కాగా, రిలయన్స్ తదితర కొన్ని కంపెనీలు వాటి జీడీఆర్‌లను లగ్జంబర్గ్, లండన్ ఎక్సేంజీల్లో లిస్ట్ చేసుకున్నాయి. కొత్త పాలసీ కారణంగా 1 బిలియన్ డాలర్ల విలువను మించిన యూనీకార్న్లు, స్టార్టప్‌లు భారీగా లబ్దిపొందే అవకాశం ఉం టుంది. అలాగే విదేశీ లిస్టింగ్‌కు యోచిస్తున్న రిలయన్స్ డిజిటల్ సబ్సిడరీ జియో ప్లాట్‌ఫామ్స్ మంచి విలువను సాధించే ఛాన్స్ ఉంది. యూఎస్, బ్రిటన్, కెనడా, స్విట్జర్లాండ్లతో సహా ఏడెనిమిది దేశాల్లో నేరుగా లిస్ట్ చేసుకునే వీలును ప్రభుత్వం కల్పిస్తుందని గతంలో వార్తలు వెలువడ్డాయి. పటిష్టమైన యాంటీ-మనీ లాండరింగ్ నియంత్రణలు కలిగిన 10 దేశాల్లోని ఎన్వైఎస్ఈ, నాస్డాక్, ఎల్ఎస్ఈ, హ్యాంగ్‌సంగ్ తదితర స్టాక్ ఎక్సేంజీల్లో నేరుగా లిస్ట్ చేసుకునే అవకాశం కల్పించాలని మార్కెట్ రెగ్యులేటర్ సెబీ ప్రతిపాదించింది.