డిజిటలైజేషన్, స్టాక్ మార్కెట్లు, ప్రైవేట్ క్యాపిటల్, కుటుంబ వ్యాపారాలు.. ఇలా అన్నీ సంపద సృష్టికి దన్నుగా నిలుస్తున్నాయి. భారత్‌లో సంపద పెరుగుదల.. విస్తరిస్తున్న దేశ ఆర్థిక వ్యవస్థను ప్రతిబింబిస్తున్నది. పెట్టుబడిదారులు, ఔత్సాహిక వ్యాపార-పారిశ్రామికవేత్తల్లో బలపడుతున్న నమ్మకానికీ అద్దం పడుతున్నది.
-శిశిర్ బైజల్, నైట్ ఫ్రాంక్ ఇండియా సీఎండీ
న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: వచ్చే ఐదేండ్లలో దేశంలో సంపన్నుల సంఖ్య భారీగా పెరుగనుందని ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ ఓ తాజా నివేదికలో అంచనా వేసింది. 2031నాటికి భారత్‌లో అల్ట్రా హై నెట్ వర్త్ ఇండివిడ్యువల్స్ (నికరంగా రూ.282 కోట్లు, ఆపై సంపద కలిగినవారు-డాలర్‌తో పోల్చితే ప్రస్తుత రూపాయి మారకం విలువ ప్రకారం 30 మిలియన్ డాలర్లు, అంతకుమించి సొమ్మున్నవారు) సంఖ్య 26 శాతం ఎగబాకి 25,217 మందికి చేరవచ్చని గురువారం విడుదల చేసిన తమ 20వ వెల్త్ రిపోర్ట్ 2026 ఎడిషన్‌లో పేర్కొన్నది.
అలాగే డాలర్ బిలియనీర్లు (రూ.9,400 కోట్లు సంపద కలిగినవారు-100 కోట్ల డాలర్ల సొమ్మున్నవారు) 51 శాతం ఎగిసి 313 మందికి పెరుగవచ్చన్నది. టెక్నాలజీ, ఇండస్ట్రియల్స్, డెట్-ఈక్విటీ, ఫారెక్స్, డెరివేటివ్స్, ఈటీఎఫ్, ప్రైమరీ, సెకండరీ మార్కెట్స్ వ్యాప్తంగా పెరుగుతున్న సంపద సృష్టే తమ అంచనాలకు కారణమని వివరించింది. కాగా, ప్రస్తుతం (ఈ ఏడాది ఆరంభంలో) భారత్‌లో అల్ట్రా హై నెట్ వర్త్ ఇండివిడ్యువల్స్ (యూహెచ్ఎన్డబ్ల్యూఐ) 19,877 మంది ఉన్నారని, డాలర్ బిలియనీర్ల సంఖ్య 207గా ఉన్నదని నైట్ ఫ్రాంక్ ఈ సందర్భంగా తెలియజేసింది.
అనిశ్చిత పరిస్థితుల్లోనూ..
భౌగోళిక-రాజకీయ అనిశ్చిత పరిస్థితులు తీవ్రంగా ఉన్నప్పటికీ, వడ్డీరేట్ల పెరుగుదలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నా, ఆర్థిక ఒడిదుడుకులు చోటుచేసుకుంటున్నా.. ప్రపంచంలో సంపద సృష్టి నాటకీయంగా పెరుగుతూనే ఉన్నదని ఈ రిపోర్టులో నైట్ ఫ్రాంక్ అభిప్రాయపడటం గమనార్హం. కాగా, 2021లో 5,51,435గా ఉన్న ప్రపంచ యూహెచ్ఎన్డబ్ల్యూఐ జనాభా.. ఇప్పుడు 7,13,626కు చేరింది. ఇక అమెరికాలో ఇప్పుడు 914 మంది డాలర్ బిలియనీర్లున్నారని, చైనాలో 485 మంది ఉన్నట్టు నైట్ ఫ్రాంక్ వెల్లడించింది. ఆ తర్వాత స్థానం భారత్‌దే (207)నని స్పష్టం చేసింది.