Digital Gold | డిజిటల్ గోల్డ్.. గత 2-3 ఏండ్లుగా ఎక్కువగా వినిపిస్తున్న పదం. డిజిటల్ గోల్డ్ అంటే.. బంగారానికి ఎలక్ట్రానిక్ రూపం. డిజిటల్ ఇన్వెస్ట్మెంట్ వేదికల ద్వారా పసిడి నిల్వ, క్రయవిక్రయాలు జరుగుతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే భౌతిక బంగారాన్ని మనం చూడవచ్చు, తాకవచ్చు, ఆభరణాలుగా మార్చి ధరించవచ్చు. కానీ డిజిటల్ గోల్డ్‌కు ఆ అవకాశాలేవీ ఉండవు. దాని విలువ మాత్రమే కనిపిస్తుంది.
నిరంతర పెట్టుబడులు
డిజిటల్ గోల్డ్ వేదికలు.. ఆన్లైన్లో బంగారంపై పెట్టుబడులు పెట్టేందుకు, దాన్ని అమ్మేందుకు, కొనేందుకు నిరంతర సేవ ల్ని అందిస్తున్నాయి.
చౌక
చిన్నచిన్న మొత్తాల్లోనూ డిజిటల్ గోల్డ్‌ను కొనవచ్చు. రిటైల్ మదుపరులకు కలిసొచ్చే అంశం.
భద్రత
ప్రధాన డిజిటల్ గోల్డ్ వేదికలు.. మదుపరులు కొన్న బంగారాన్ని భద్రంగా నిల్వ చేస్తున్నాయి. భౌతిక బంగారానికున్న దొంగతనం బెడద దీనికుండదు.
సులభంగా నగదు
డిజిటల్ గోల్డ్‌ను అవసరమనుకున్నప్పుడు సులభంగానే నగదుగా మార్చుకోవచ్చు. తరుగు వంటివి ఉండవు కాబట్టి సాధారణ పసిడితో పోల్చితే మదుపరులకు రీ-సేల్‌లో అత్యధిక స్థాయిలో నగదునూ పొందవచ్చు.
పారదర్శకంగా ధరలు
ధరల్లో పారదర్శకత ఉంటుంది. ప్రధాన డిజిటల్ గోల్డ్ వర్తకులు మార్కెట్ ధరల ఆధారంగా ఈ క్రయవిక్రయాలు జరుపుతారు.