శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Business - Jan 25, 2021 , 01:24:37

ఐటీ రిఫండ్‌ వచ్చిందా

ఐటీ రిఫండ్‌  వచ్చిందా

ఆదాయ పన్ను రిటర్ను దాఖలు చేశారా? రిఫండ్‌ కోసం క్లెయిమ్‌ చేసుకున్నారా? ఈ క్లెయిములు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకోవడంపై చాలా మందికి పెద్దగా అవగాహన ఉండకపోవచ్చు. కానీ ఇదేమీ బ్రహ్మపదార్థం కాదు. రిఫండ్‌ స్టేటస్‌ను తెలుసుకునేందుకు పెద్దగా కష్టపడనక్కర్లేదు. ఎవరైనా దీన్ని ఆన్‌లైన్‌లో సులభంగానే తెలుసుకునేందుకు వీలున్నది.

స్టేటస్‌ను తెలుసుకోవడం ఇలా..

ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ రిఫండ్‌ అనేది ఓ వ్యవస్థ. ఒక ఆర్థిక సంవత్సరానికి ఎవరైనా వాస్తవంగా చెల్లించాల్సిన ఆదాయ పన్ను కంటే ఎక్కువ మొత్తాన్ని చెల్లించినట్లయితే ఆ సొమ్మును ఐటీ విభాగం వాపసు ఇస్తుంది. దీనినే రిఫండ్‌ అంటారు. ఐటీ చెల్లింపుదారులు అధికంగా చెల్లించిన పన్నును ఆదాయ పన్ను చట్టం-1961లోని సెక్షన్‌ 237 కింద రీక్లెయిమ్‌ చేసుకోవచ్చు. సాధారణంగా ఐటీ రిటర్ను (ఐటీఆర్‌) ప్రాసెస్‌ అయిన తర్వాత 20 నుంచి 45 రోజుల్లో ఈ సొమ్మును వాపసు చేస్తారు. ఒకవేళ అలా జరుగకపోతే రిఫండ్‌ స్థితిగతుల (స్టేటస్‌)ను ఆన్‌లైన్‌లో సులభంగానే తెలుసుకోవచ్చు. అందుకు రెండు మార్గాలున్నాయి. అవి ఏమిటంటే..

ఈ-ఫైలింగ్‌ పోర్టల్‌

తొలుత కంప్యూటర్‌ను ఓపెన్‌ చేసి ఐటీ విభాగ ఈ-ఫైలింగ్‌ పోర్టల్‌లోకి లాగిన్‌ కావాలి.

తర్వాత ‘వ్యూ రిటర్న్స్‌ లేదా ఫామ్స్‌' అనే ఆప్షన్‌ను సెలెక్ట్‌ చేయాలి.

‘మై అకౌంట్‌' అనే ట్యాబ్‌లో ‘ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ రిటర్న్స్‌' అనే ఆప్షన్‌ను సెలెక్ట్‌ చేసి ‘సబ్‌మిట్‌'పై క్లిక్‌ చేయాలి.

అనంతరం ‘ఎక్నాలెడ్జ్‌మెంట్‌ నంబర్‌'పై క్లిక్‌ చేసి.. ఆ నంబర్‌ను పొందుపర్చిన తర్వాత మీ ఆదాయ పన్ను రిఫండ్‌ స్టేటస్‌ కంప్యూటర్‌ స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతుంది.

ఎన్‌ఎస్‌డీఎల్‌ వెబ్‌సైట్‌

రిఫండ్‌ను ట్రాక్‌ చేసేందుకు తొలుత కంప్యూటర్‌ను ఓపెన్‌ చేసి ఎన్‌ఎస్‌డీఎల్‌ వెబ్‌సైట్‌ను సందర్శించాలి.

అనంతరం మీ శాశ్వత ఖాతా సంఖ్య (పాన్‌), ఆధార్‌, పన్ను మదింపు సంవత్సరం లాంటి వివరాలను పొందుపర్చి ‘ప్రొసీడ్‌'పై క్లిక్‌ చేయాలి.

ఆ తర్వాత రిఫండ్‌ స్టేటస్‌ మీ కంప్యూటర్‌ స్క్రీన్‌పై ప్రదర్శితమవుతుంది.

చివరి గంటలో ఉరుకులు

ఆదాయ పన్ను రిటర్నుల దాఖలు కోసం వ్యక్తులకు నిర్దేశించిన గడువు ఈ నెల 10వ తేదీ అర్ధరాత్రితో ముగిసింది. అప్పటికి మొత్తం 31 లక్షలకుపైగా ఐటీ రిటర్నులు దాఖలైనట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వీటిలో దాదాపు 2 లక్షల ఐటీఆర్‌లు చివరి గంట సమయంలోనే దాఖలైనట్లు వెల్లడించింది. ఈ నెల 10వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు 17,97,625 ఐటీ రిటర్నులు దాఖలయ్యాయని, వీటిలో 2,39,013 రిటర్నులు ఆ రోజు సాయంత్రం 5-6 గంటల మధ్యలో.. మరో 1,93,552 రిటర్నులు చివరి గంటలో దాఖలయ్యాయని ఐటీ విభాగం స్పష్టం చేసింది.

ఐటీలో ఆదా ఇలా..

ఆదాయం పన్ను (ఐటీ) చట్టంలోని పలు సెక్షన్ల కింద పన్ను చెల్లింపుదారులు పన్ను మినహాయింపులను పొందవచ్చు. అవేంటో ఒక్కసారి పరిశీలిద్దాం..

సెక్షన్‌ 80సీ: ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, ఇన్సూరెన్స్‌ ప్లాన్లు, ఈక్విటీ లింక్డ్‌ సేవింగ్స్‌ స్కీములు, పిల్లల చదువుల ఫీజులు, ఈపీఎఫ్‌, జీవిత బీమా ప్రీమియంలు, గృహ రుణాలు, సుకన్య సమృద్ధి యోజన వంటి వాటిపై సెక్షన్‌ 80సీలో పన్ను మినహాయింపును పొందవచ్చు.

సెక్షన్‌ 80జీజీ: వేతన, వేతనేతర జీవులు సెక్షన్‌ 80జీజీ కింద రూ.60వేల వరకు ఇంటి అద్దెపై పన్ను మినహాయింపును పొందవచ్చు. హౌజ్‌ రెంట్‌ అలవెన్సు (హెచ్‌ఆర్‌ఏ)లతో నిమిత్తం లేకుండా అందరికీ అవకాశం ఉంటుంది. అయితే పనిచేస్తున్న ప్రాంతంలో ఎలాంటి సొంత నివాసం ఉండరాదు. 

సెక్షన్‌ 24: ఈ సెక్షన్‌ ద్వారా గృహ రుణం పొందడానికి చేసిన ఖర్చులపైనా పన్ను మినహాయింపును అందుకోవచ్చు. హోం లోన్‌ చెల్లింపులకు సంబంధించి వడ్డీపై రూ.2 లక్షల వరకు పన్నులను ఆదా చేసుకోవచ్చు.

సెక్షన్‌ 80డీ: ముందస్తు ఆరోగ్య పరీక్షల వ్యయం, ఆరోగ్య బీమా ప్రీమియంలు, కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకాల కోసం చేసే చెల్లింపులు, వైద్య చికిత్సల ఖర్చుల్లో రూ.75వేల వరకు సెక్షన్‌ 80డీ కింద పన్ను మినహాయింపు కోరవచ్చు.

సెక్షన్‌ 80జీ: ఎన్జీవోలకు లేదా ప్రభుత్వ రిలీఫ్‌ ఫండ్లకు చేసే విరాళాలను సెక్షన్‌ 80జీ కింద చూపి పన్ను మినహాయింపును పొందవచ్చు. ఇలా 50 శాతం వరకు క్లయిమ్‌ చేసుకునే అవకాశం ఉన్నది. 


VIDEOS

logo