DGCA – Vistara | టాటా సన్స్ అనుబంధ సంస్థ విస్తారా ఎయిర్ లైన్స్‌పై కేంద్ర పౌర విమానయాన రంగ నియంత్రణ సంస్థ – డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) కొరడా ఝుళిపించింది. పైలట్ల శిక్షణలో పొరపాట్లకు కారణమైన విస్తారా సీనియర్ అధికారిని సస్పెండ్ చేసిందని అధికార వర్గాలు తెలిపాయి. పూర్తి స్థాయి విమాన సర్వీసుల సంస్థ విస్తారా ట్రైనింగ్ వైస్ ప్రెసిడెంట్ విక్రమ్ మోహన్ దయాల్‌ను సస్పెండ్ చేసినట్లు అధికార వర్గాల కథనం. దీనిపై స్పందించేందుకు విస్తారా ఎయిర్ లైన్స్ ముందుకు రాలేదు.
విస్తారా పైలట్లతో డీజీసీఏ విచారణ జరిపింది. కన్వర్షన్ ట్రైనింగ్ విషయంలో పొరపాట్లు జరిగినట్లు డీజీసీఏ తన విచారణలో గుర్తించింది. పది మందికి పైగా పైలట్ల నుంచి కన్వర్షన్ ట్రైనింగ్ విషయంలో పొరపాట్లు జరిగినట్లు నిర్ధారణకు వచ్చింది. దీంతో విస్తారా ఎయిర్ లైన్స్ ట్రైనింగ్ హెడ్ కు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం.