DGCA | విమానయాన సంస్థలకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్స్ పలు మార్గదర్శకాలను జారీ చేసింది. విమానయాన సంస్థలకు కస్టమర్స్ హక్కులు, నియమ నిబంధనలకు అవగాహన కల్పించాలని ఆదేశించింది. టికెట్ బుక్ చేసుకున్న తర్వాత.. అందుబాటులో ఉన్న ప్రయాణికుల చార్టర్ ఆన్లైన్ లింక్‌ను ప్రయాణికుడికి ఎస్ఎంఎస్, వాట్సాప్ ద్వారా పంపాలని డీజీసీఏ అన్ని విమానయాన సంస్థలకు సూచించింది. ఇకపై ప్రయాణికులు విమాన టికెట్స్‌ను బుక్ చేసుకున్న సమయంలోనే వారి హక్కులు, సౌకర్యాలకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకునే వీలు కలుగనున్నది.
డీజీసీఏ ఆదేశాల ప్రకారం.. అన్ని విమానయాన సంస్థలు టికెట్లను బుక్ చేసుకున్న తర్వాత ప్రయాణికులకు ఆన్లైన్ లింక్ ద్వారా తమ హక్కుల గురించి తెలియజేయాల్సి ఉంటుంది. ఈ లింక్‌లో ప్రయాణికుల హక్కులు, నియమాలు, ఫిర్యాదుల పరిష్కారానికి సంబంధించిన పూర్తి సమాచారం ఉండనున్నది. తద్వారా ప్రయాణికులు ఏదైనా సమస్యను సులభంగా పరిష్కరించుకునే అవకాశంతో పాటు విమాన ప్రయాణ సమయంలో పొందే హక్కుల గురించి స్పష్టమైన సమాచారం లభించనుంది. ఎందుకంటే సాధారణంగా ప్రయాణీకులు విమానాల రద్దు, బోర్డింగ్ తిరస్కరణ, బ్యాగేజ్ మిస్సింగ్, బ్యాగేజ్ మిస్సింగ్ లాస్ సమయాల్లో సమస్యలు ఎదుర్కొంటారు. చాలా మంది ప్రయాణికులకు ఆయా పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియని పరిస్థితి ఎదురవుతుంది. ఈ క్రమంలో తాజాగా డీజీసీఏ ఆదేశాలతో స్పష్టమైన సమాచారంతో పాటు ఫిర్యాదులను సైతం పరిష్కరించుకునే అవకాశం కలుగనున్నది.
డీజీసీఏ ఆదేశాలతో విమానయాన సంస్థలు సమాచారాన్ని ఎయిర్‌లైన్ వెబ్‌సైట్‌తో పాటు టికెట్లో ప్రముఖంగా అందుబాటులో ఉంచాలి. విమానం ఆలస్యం, విమానం రద్దు విషయంలో పరిహారం, బ్యాగేజీకి సంబంధించిన రూల్స్, ఇతర ముఖ్యమైన సమాచారం గురించి సమాచారం సులభంగా దొరనున్నది. డీజీసీఏ ఆదేశాల నేపథ్యంలో విమానయాన కంపెనీలు మార్పులు చేస్తున్నాయి. విమానయాన సంస్థ స్పైస్‌జెట్ ఇప్పటికే ఈ ప్రక్రియను అమలులోకి తీసుకువచ్చింది. టికెట్ బుకింగ్‌తో పాటు ప్రయాణీకుల హక్కుల గురించి సమాచారాన్ని పంపుతున్నది. ఇండిగో సైతం త్వరలోనే ఈ ప్రక్రియను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నది.