హైదరాబాద్, సెప్టెంబర్ 27(నమస్తే తెలంగాణ): ఐటీ, పునరుత్పాక విద్యుత్, వస్తు ఉత్పత్తిలో పురోగమిస్తున్న హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టాలని అమెరికన్ కంపెనీలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు. అమెరికాలో గురువారం జరిగిన మైన్ఎక్స్పో సదస్సులో ఆయన అంతర్జాతీయ, అమెరికన్ కంపెనీ ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించారు. మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఫేస్బుక్, యాపిల్ లాంటి దిగ్గజ సంస్థల పెట్టుబడులతో హైదరాబాద్ గ్లోబల్‌సిటీగా, ఇన్సోవేషన్ సెంటర్‌గా రూపుదిద్దుకున్నదని, తమ ప్రభుత్వం వ్యాపార అనుకూల విధానాలను అవలంభిస్తున్న నేపథ్యంలో విరివిగా పెట్టుబడులు పెట్టాలని కోరారు. కొత్తగా నిర్మించనున్న ఫ్యూచర్‌సిటీలో ఐటీ, కృత్రిమ మేధస్సు, స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తదితర రంగాల్లో విస్తృత అవకాశాలున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇక్కడ మౌలిక వసతుల కల్పనకు విరివిగా నిధులు కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నదన్నారు. ఈ అవకాశాన్ని ఇంటర్నేషనల్ కంపెనీలు వినియోగించుకోవాలని సూచించారు.