Maruti Suzuki Ertiga | దేశీయ కార్ల మార్కెట్లో ఎస్ యూవీలతోపాటు మల్టీ పర్పస్ వెహికల్స్ (ఎంపీవీ)కూ ఫుల్ గిరాకీ ఉంది. టయోటా రుమియాన్, టయోటా ఇన్నోవా క్రిస్టా, టయోటా ఇన్నోవా హైక్రాస్, మారుతి సుజుకి ఇన్విక్టో, మారుతి సుజుకి ఎక్స్ఎల్6, కియా కరెన్స్, రెనాల్ట్ టైబర్ వంటి ఎంపీవీ కార్లు అందుబాటులో ఉన్నాయి. కానీ, మారుతి సుజుకి ఎర్టిగా మోడల్ కారు చాలా పాపులారిటీ పొందిన ఎంపీవీ కారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా అమ్ముడైన ఎంపీవీ కారు ఇదే.
గత ఆర్థిక సంవత్సరంలో నెలకు 12479 కార్ల చొప్పున 1,49,757 కార్లు అమ్ముడయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి జూలై వరకూ 59,040 (సగటున నెలకు 14,760) కార్లు అమ్ముడయ్యాయి. గతేడాదితో పోలిస్తే మారుతి ఎర్టిగా పాపులారిటీ పెరుగుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ లో 13,544 యూనిట్లు అమ్ముడు పోగా, మే నెలలో 13,893, జూన్ లో 15,902, జూలైలో 15,701 కార్లు అమ్ముడయ్యాయి.
పెట్రోల్, సీఎన్జీ వేరియంట్లతోపాటు మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్లలో అందుబాటులో ఉందీ మారుతి ఎర్టిగా. డీసెంట్ బెల్స్, విస్టెల్స్ తో ఏడుగురు హాయిగా ప్రయాణం చేయొచ్చు. అత్యంత అందుబాటు ధరలో లభిస్తుందీ కారు. ఎర్టిగా కారు ధర రూ.8.69 లక్షల నుంచి రూ.13.03 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య, సీఎన్జీ వర్షన్ రూ.10.78 లక్షల నుంచి రూ.11.88 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య పలుకుతోంది.
మారుతి ఎర్టిగా కారు కే15సీ స్మార్ట్ హైబ్రీడ్ 1.5 లీటర్ల పెట్రోల్ ఇంజిన్ తో వస్తుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 103 పీఎస్ విద్యుత్, 137 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్లలో లభిస్తుంది. సీఎన్జీ వర్షన్ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్ తోపాటు గరిష్టంగా 88 పీఎస్ విద్యుత్, 121 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. పెట్రోల్ వేరియంట్ 20.51 కి.మీ, సీఎన్జీ వేరియంట్ 26.11 కి.మీ మైలేజీ అందిస్తుంది.
మారుతి సుజుకి ఎర్టిగా హలోజన్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, 15-అంగుళాల అల్లాయ్ వీల్స్, క్యాబిన్ లోపల 7-అంగుళాల స్మార్ట్ ప్లే ప్రో టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ ఏసీ, సెకండ్ రో రూఫ్ మౌంటెడ్ ఏసీ, ఎంఐడీ, కలర్డ్ టీఎఫ్టీ, సేఫ్టీ కోసం డ్యుయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్, ఏబీఎస్ విత్ ఈబీడీ, బ్రేక్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ హోల్డ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.