హైదరాబాద్, జూన్ 11: నాలుగు డీల్స్.. మూడు కోట్ల అద్దె.. రెండు ప్రాంతాలు.. ఒక్క నగరం. ఇదీ.. హైదరాబాద్ ఆఫీస్ స్పేస్ మార్కెట్‌కు అగ్రశ్రేణి బహుళజాతి సంస్థల నుంచి వస్తున్న డిమాండ్‌కు సంక్షిప్త రూపం. క్వాల్కామ్, ఎల్‌టీఐమైండ్‌ట్రీ, ఐబీఎం, ఎస్అండ్పీ క్యాపిటల్ ఐక్యూ సంస్థలు.. నగర ఐటీ హబ్‌లు హైటెక్ సిటీ, గచ్చిబౌలి ప్రాంతాల్లో 8.7 లక్షల చదరపు అడుగుల (ఎస్ఎఫ్టీ) ఆఫీస్ స్పేస్‌ను లీజుకు తీసుకున్నాయి. ఇటీవలే పూర్తయిన డీల్స్, ప్రాప్‌స్టాక్ వివరాల ప్రకారం వీటి నెలవారీ అద్దెలు కనిష్ఠంగా రూ.70 లక్షలు, గరిష్ఠంగా రూ.3 కోట్లపైనే ఉండటం గమనార్హం.
క్వాల్కామ్ 4.14 లక్షలు
హైటెక్ సిటీలో అమెరికాకు చెందిన సెమీకండక్టర్, సాఫ్ట్వేర్ దిగ్గజం క్వాల్కామ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 4.14 లక్షల చదరపు అడుగులకుపైగా కార్యాలయ స్థలాన్ని లీజుకు తీసుకున్నది. నెలకు దీని అద్దె రూ.3.15 కోట్లు. స్కైవ్యూ బిల్డింగ్‌లో 18 నుంచి 22 వరకున్న 5 ఫ్లోర్లు క్వాల్కామ్ ఇండియావే. ఈ ఏడాది ఫిబ్రవరి 12 నుంచే లీజు మొదలవగా, ఐదేండ్లపాటు ఉంటుంది. ఇక ఈ ఆఫీస్ స్పేస్ కోసం సెక్యూరిటీ డిపాజిట్‌గా కంపెనీ రూ.16.4 కోట్లు చెల్లించింది. లీజు డాక్యుమెంట్ల ప్రకారం తొలి ఏడాది ముగిశాక అద్దె 7 శాతం పెరుగుతుంది. అలాగే 15 ఏండ్ల తర్వాత 15 శాతం ఎక్కువవుతుంది. ఈ మేరకు ఆర్ఎంజెడ్ గ్రూప్‌లో భాగమైన దివిజ కమర్షియల్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్‌తో క్వాల్కామ్ డీల్ చేసుకున్నది.
ఎస్అండ్పీ 2.41 లక్షలు
అమెరికాకు చెందిన ఎస్అండ్పీ గ్లోబల్ రిసెర్చ్ డివిజన్.. ఎస్అండ్పీ క్యాపిటల్ ఐక్యూ ఇండియా హైటెక్ సిటీలోని స్కైవ్యూలోనే 2.41 లక్షల చదరపు అడుగుల్లో ఆఫీస్ స్పేస్‌ను లీజుకు తీసుకున్నది. నెలకు దీని అద్దె రూ.1.77 కోట్లు. లీజు ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచే ఆరంభమవగా, సెక్యూరిటీ డిపాజిట్‌గా సంస్థ రూ.10.6 కోట్లు చెల్లించింది. స్కైవ్యూలో 19 నుంచి 21 వరకు మూడు ఫ్లోర్లు ఎస్అండ్పీ క్యాపిటల్వే. లీజు కాలవ్యవధి ఐదేండ్లు. లీజు డాక్యుమెంట్ల ప్రకారం రెండేండ్ల తర్వాత అద్దె 15 శాతం పెరుగుతుంది. ఈ మేరకు దివిజ కమర్షియల్ ప్రాపర్టీస్‌తో ఎస్అండ్పీ క్యాపిటల్ డీల్ చేసుకున్నది.
ఎల్‌టీఐమైండ్‌ట్రీ 1.09 లక్షలు
భారతీయ ఐటీ సేవల సంస్థ ఎల్‌టీఐమైండ్‌ట్రీ లిమిటెడ్ సైతం హైటెక్ సిటీలోని స్కైవ్యూ భవనంలో 1.09 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్‌ను లీజుకు తీసుకున్నది. నెలవారీ అద్దె రూ.89.18 లక్షలు. స్కైవ్యూలోని 14, 15 ఫ్లోర్లు మైండ్ట్రీవే. సెక్యూరిటీ డిపాజిట్‌గా 6.2 కోట్లు చెల్లించింది. గత నెల మే 1 నుంచే లీజు మొదలవగా, ఐదేండ్లపాటు ఉంటుంది. దివిజ కమర్షియల్ ప్రాపర్టీస్‌తో జరిగిన లీజు డాక్యుమెంట్ల ప్రకారం ఏటా అద్దె 5 శాతం పెరుగుతున్నది.
ఐబీఎం 1.06 లక్షలు
గచ్చిబౌలిలోని దివ్యశ్రీ ఓరియన్‌లో అమెరికాకు చెందిన ఐటీ దిగ్గజం ఐబీఎం ఇండి యా ప్రైవేట్ లిమిటెడ్ 1.06 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్‌ను లీజుకు తీసుకున్నది. నెలవారీ అద్దె రూ.70.23 లక్షలు. 26 ఎకరాల్లో విస్తరించిన ఈ క్యాంపస్‌లో 10, 11 ఫ్లోర్లు ఐబీఎం ఇండియావే. ఇక ఈ కార్యాలయ స్థలం కోసం ఐబీఎం.. సెక్యూరిటీ డిపాజిట్‌గా రూ.4.21 కోట్లు చెల్లించింది. ఈ ఏడాది ఏప్రిల్ 15 నుంచే లీజు మొదలవగా, ఐదేండ్లపాటు ఉంటుంది. లీజు డాక్యుమెంట్ల ప్రకారం ఆ తర్వాత అద్దె 4 శాతం పెరుగుతుంది. ఈ మేరకు మైదాస్ ప్రాజెక్ట్స్‌తో ఐబీఎం ఇండియా ఒప్పందం చేసుకున్నది.
హైదరాబాద్ పశ్చిమ ప్రాంతంలో ఆఫీస్ స్పేస్ మార్కెట్ భారీగా విస్తరించింది. మునుపెన్నడూ లేనివిధంగా గత కొన్నేండ్లు ఇక్కడ బలమైన వృద్ధి కనిపించింది. దేశ, విదేశీ సంస్థల రాకతో ఒక్కసారిగా కార్యాలయ స్థలాలకు డిమాండ్ గరిష్ఠ స్థాయిలను తాకింది. భారత్‌లో విస్తరించే బహుళజాతి కంపెనీల చూపు హైదరాబాద్‌పైనే పడింది. ఇక 2021 నుంచి ఈ ఏడాది మార్చిదాకా హైదరాబాద్ రెసిడెన్షియల్ మార్కెట్లో బ్రహ్మాండమైన వృద్ధి నమోదైంది.
ఈ మూడేండ్లకుపైగా కాలంలో మొత్తం దాదాపుగా 2,18,800 కొత్త నివాసాల నిర్మాణం జరిగింది. అందులో 1,54,300 యూనిట్లు అమ్ముడైపోయాయి. ఒక్క 2023లోనే సుమారు 76,300 ఇండ్లు అందుబాటులోకి రాగా, 61,700 ఇండ్ల అమ్మకాలు జరిగాయి. సగటున ఇండ్లపై పెట్టుబడుల విలువ 52 శాతం పెరిగింది. ఇదే క్రమంలో చదరపు అడుగు ధర కూడా రూ.7,200 పలికింది. మొత్తంగా గత మూడేండ్లలో ఇక్కడి భూముల ధరలు 30 శాతంపైనే పెరిగాయి.
-ప్రశాంత్ థాకూర్, అనరాక్ గ్రూప్ రిసెర్చ్ ప్రాంతీయ డైరెక్టర్
హైదరాబాద్‌లో రియల్టీ బూమ్
తెలంగాణ రాష్ట్ర విభజనకు ముందు సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి పాలకుల నిర్లక్ష్య ధోరణితో అంతంతమాత్రంగానే సాగిన హైదరాబాద్ అభివృద్ధి.. స్వరాష్ట్రంలో రాకెట్ వేగాన్ని అందుకున్నది. రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపు, దూరదృష్టితో ఐటీ, ఐటీ అనుబంధ రంగాలు పెద్ద ఎత్తున విస్తరించాయి. ఇందుకు తగ్గట్టుగానే నాటి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక శ్రద్ధతో అంతటా మెరుగైన మౌలిక వసతుల కల్పన జరిగిందని ఐటీ, నిర్మాణ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా యావత్తు వ్యాపార వ్యవస్థలో నెలకొన్న ఉత్సాహంతో నివాస, వాణిజ్య స్థలాలకు డిమాండ్ పెరిగిందన్నారు.