Dell Lay offs | అంతర్జాతీయ ఆర్థిక మాంద్యం ముప్పు పేరుతో కార్పొరేట్ సంస్థలు కొంత కాలంగా ఉద్యోగులను ఇండ్లకు సాగనంపుతున్నాయి. ఆర్థిక మాంద్యం ముప్పుతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రభావం కూడా ఉద్యోగుల ఉద్వాసనకు కారణాలుగా ఉన్నాయి. గతేడాది చివర్లో మొదలైన లే-ఆఫ్లు.. ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా గ్లోబల్ టెక్నాలజీ సంస్థ ‘డెల్’ రెండో విడుత లే-ఆఫ్లు అమలు చేసేందుకు సిద్ధమైంది.
మార్కెట్లో గిరాకీని తగ్గట్లుగా సేల్స్ పెంచుకోవడానికి కంపెనీ కొత్త విధి విధానాలు అమలు చేయనున్నట్లు డెల్ అధికార ప్రతినిధి తెలిపారు. తద్వారా వినియోగదారులకు మెరుగైన సేవలందించడమే లక్ష్యంగా సరికొత్త ఆవిష్కరణలు చేపట్టే అవకాశం వస్తుందన్నారు. దీనివల్ల సేల్స్ విభాగం సిబ్బందిపై ప్రతికూల ప్రభావం పడుతుందని తెలిపారు. గత ఫిబ్రవరిలో 6,500 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. ఇది కంపెనీ మొత్తం ఉద్యోగుల్లో ఐదు శాతం. కంప్యూటర్ల సేల్స్ గణనీయంగా తగ్గడం వల్లే ఉద్యోగులను తొలగించినట్లు గతంలో డెల్ తెలిపింది.