మార్చి త్రైమాసికంలో 22 శాతం డౌన్
న్యూఢిల్లీ, మే 25: దేశీయ కుబేరుడు గౌతమ్ అదానీకి చెందిన అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ లిమిటెడ్(ఏపీసెజ్) నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.1,033 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.1,321 కోట్ల కంటే ఇది 21.78 శాతం తక్కువ. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం రూ.4,072.42 కోట్ల నుంచి రూ.4,417. 87 కోట్లకు పెరిగినట్లు బీఎస్ఈకి సమాచారం అందించింది.
నిర్వహణ ఖర్చులు రూ.2,526.91 కోట్ల నుంచి రూ.3,309.18 కోట్లకు పెరగడం వల్లనే లాభాల్లో గండిపడిందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. గడిచిన ఆర్థిక సంవత్సరంలో సంస్థ పలు మైలురాళ్ళను సాధించిందని కంపెనీ సీఈవో కరన్ అదానీ తెలిపారు. రికార్డుస్థాయిలో ముంద్రా పోర్ట్ నుంచి 312 మిలియన్ మెట్రిక్ టన్నుల సరుకునురవాణా చేసినట్లు చెప్పారు. 2021-22 ఏడాదిలో కంపెనీ కన్సాలిడేటెడ్ ఆదాయం(గంగవరం పోర్ట్ మినహా) 27 శాతం పెరిగి రూ.15,394 కోట్లు ఆర్జించింది. మరోవైపు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 100 రైళ్ళులో పెట్టుబడులు పెట్టబోతున్నట్లు ప్రకటించింది.