న్యూఢిల్లీ, ఆగస్టు 15 : వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) విధానాన్ని హేతుబద్ధీకరించనున్నారు. దీంతో ఇప్పుడున్న ట్యాక్స్ స్లాబులు సగానికి తగ్గిపోనున్నాయి. 2 పన్ను రేట్లనే ఉంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది మరి. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ.. ఆయా రాష్ర్టాల ఆర్థిక మంత్రులతో కూడిన కమిటీకి ప్రతిపాదించింది. వచ్చే నెలలో జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో దీన్ని తేల్చనున్నట్టు సంబంధిత ఉన్నతాధికార వర్గాలు చెప్తున్నాయి. రకరకాల కేంద్ర, రాష్ట్ర స్థాయి పన్నులను కలిపి 2017 జూలై 1 నుంచి దేశంలో జీఎస్టీని అమల్లోకి తెచ్చిన సంగతి విదితమే.
జీఎస్టీలో ప్రస్తుతం 5, 12, 18, 28 శాతం పన్ను స్లాబులున్నాయి. మార్కెట్లోని దాదాపు అన్ని వస్తూత్పత్తులపై ఈ స్లాబుల ప్రకారమే పరోక్ష పన్నులు పడుతున్నాయి. అయితే ఈ ఏడాది దీపావళికల్లా కొత్త జీఎస్టీ విధానాన్ని తీసుకురావాలని మోదీ సర్కారు చూస్తున్నది. ఇందులో భాగంగానే పన్ను స్లాబులను కేవలం 5, 18 శాతాలకే పరిమితం చేయాలని నిర్ణయించారు. శుక్రవారం భారత 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ మేరకు సంకేతాలిచ్చారు. కాగా, కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సారథ్యంలోని జీఎస్టీ కౌన్సిల్ జరిపే సమావేశంలో ఆమోదముద్ర పడితే 12 శాతం స్లాబులోని 99 శాతం వస్తూత్పత్తులు 5 శాతంలోకి, 28 శాతం స్లాబులోని 90 శాతం వస్తూత్పత్తులు 18 శాతంలోకి రానున్నాయి. మిగతా (పొగాకు, ఇతర లగ్జరీ వస్తూత్పత్తులు) వాటిపై గరిష్ఠంగా 40 శాతం జీఎస్టీ పడుతుంది. ఈ శ్రేణిలో కేవలం 5-7 వస్తూత్పత్తులే (పొగాకు, లగ్జరీ కార్లు, బైకులు మొదలైనవి) ఉన్నాయంటున్నారు. ఆన్లైన్ గేమింగ్‌పైనా గరిష్ఠ జీఎస్టీనే పడుతుందని చెప్తున్నారు.
ప్రస్తుతం జీఎస్టీలో కనీస పన్ను 5 శాతం స్లాబులో రోజువారీ నిత్యావసర వస్తూత్పత్తులున్నాయి. ఇక స్టాండర్డ్ గూడ్స్‌పై 12 శాతం, ఎలక్ట్రానిక్స్, ఆయా రకాల సేవలపై 18 శాతం, పొగాకు, ఇతర విలాసవంతమైన ఐటమ్స్‌పై గరిష్ఠంగా 28 శాతం పన్నులు పడుతున్నాయి. ఈ క్రమంలోనే అదనంగా పాన్ మసాలా, లగ్జరీ కార్లు తదితరాలపై జీఎస్టీ నష్టపరిహార సెస్సును కూడా విధిస్తున్నారు. జీఎస్టీ అమలుతో రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయానికి వాటిల్లుతున్న నష్టాలను భర్తీ చేయడానికే ఈ సెస్సు. అలాగే కొన్ని నిత్యావసరాలకు జీఎస్టీ మినహాయింపుండగా.. ప్రత్యేకంగా వజ్రాలు, సానబెట్టిన రత్నాలు, బంగారంపై 0.25 శాతం నుంచి 3 శాతం వరకు జీఎస్టీ విధిస్తున్నారు.
ఇప్పుడున్న జీఎస్టీ స్లాబుల్లో 18 శాతం చాలా కీలకం. జీఎస్టీ వసూళ్లలో ఈ ఒక్క స్లాబు నుంచి వచ్చే ఆదాయం వాటానే 65 శాతంగా ఉన్నది మరి. జీఎస్టీ 2.0లో ఈ స్లాబును యథాతథంగానే ఉంచుతుండటం గమనార్హం. అంటే ప్రస్తుతం ఈ స్లాబులో ఉన్న వస్తూత్పత్తుల ద్వారా ప్రభుత్వ ఖజానాకు వస్తున్న ఆదాయానికి ఢోకా లేదన్నమాట. ఫలితంగా వాటి వినియోగదారులకు ఇకపైనా ఏమాత్రం ప్రయోజనం ఉండదు. ఇప్పుడు ఎంతకు కొంటున్నారో.. కొత్త జీఎస్టీ విధానంలోనూ వాటి కోసం అంతే చెల్లించాల్సి ఉంటుంది. దీంతో మోదీ సర్కారు గొప్పగా జనాలపై జీఎస్టీ భారాన్ని తగ్గించబోతున్నామని, దీపావళి కానుక అంటూ ఊదరగొడుతుండటం అంతా ఉత్తదే. మెజారిటీ వినియోగదారులకు జీఎస్టీ స్లాబుల తగ్గింపు వల్ల ఒనగూరుతున్నదేమీ లేదన్నది తేటతెల్లమైపోయింది. అలాగే ప్రస్తుతం పేద, మధ్య తరగతి వర్గా లు కొంటున్న 5 శాతం స్లాబులోని వస్తూత్పత్తులపై పన్ను భారం అలాగే ఉంటుంది.
ఇక పొగాకు, ఆన్లైన్ గేమింగ్స్, లగ్జరీ బైకులు, కార్లు ఇతర వస్తూత్పత్తులపై గరిష్ఠంగా 40 శాతం జీఎస్టీ ఉండనే ఉంటున్నది. దీంతో కొత్త జీఎస్టీ విధానం వచ్చి పన్ను స్లాబులు తగ్గినా మొత్తం పన్ను భారం మాత్రం ఇప్పుడున్నట్టుగానే ఆయా కొనుగోలుదారులపై 88 శాతంగానే ఉం టుందన్న అంచనాలున్నాయి. దీంతో 12 శాతం, 28 శాతం స్లాబులను తీసేయడం వల్ల నష్టపోతున్న ఆదాయం అంతంత మాత్రమేనని పలువురు ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తుండటం గమనార్హం. నిజానికి జీఎస్టీ వసూళ్లలో ఇప్పుడు 12 శాతం స్లాబు ద్వారా 5 శాతం, 28 శాతం స్లాబు ద్వారా 11 శాతం ఆదాయమే వస్తున్నది. ఏదిఏమైనా కేంద్ర ప్రభుత్వ జీఎస్టీ స్లాబుల తగ్గింపు జిమ్మిక్కులకు ఈ లెక్కలన్నీ నిదర్శనం. అలాగే బంగారం, వజ్రాలు, ఇతర విలువైన రత్నాలపై జీఎస్టీ యథాతథంగానే ఉండనున్నది. దీంతో స్థూలంగా జీఎస్టీ స్లాబుల సవరణతో సగటు సాధారణ వినియోగదారునికి కేంద్రంలోని మోదీ సర్కారు చేకూర్చే లబ్ధి ఏమీ లేదని తేలిపోయింది. దీపావళి కానుక తుస్సే.