న్యూఢిల్లీ, జనవరి 11: డీ-మార్ట్ పేరుతో రిటైల్ అవుట్లెట్లను నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్మార్ట్స్ లిమిటెడ్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను సంస్థ రూ.723.54 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.690.41 కోట్ల కంటే ఇది 4.8 శాతం అధికమని పేర్కొంది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 17.68 శాతం ఎగబాకి రూ.15,972.55 కోట్లకు చేరుకున్నది. 2023-24 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ.13,572.47 కోట్లుగా ఉన్నది. నిర్వహణ ఖర్చులు 18.52 శాతం ఎగబాకి రూ.15,001.64 కోట్లకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా కంపెనీ సీఈవో, ఎండీ నెవెల్లీ నోరోన్హా మాట్లాడుతూ..పలు ఎఫ్ఎంసీజీ విభాగ ఉత్పత్తులను తగ్గించడం. మెట్రో నగరాల్లో స్టోర్లు అధికమవడం వల్లనే ఆర్థిక ఫలితాలపై ప్రభావం చూపుతున్నదన్నారు. గత త్రైమాసికంలో ఆన్లైన్లో ఆర్డర్లు 21 శాతం చొప్పున పెరిగాయని తెలిపింది.