Gold Smuggling | సౌదీ అరేబియా రాజధాని రియాద్ నుంచి వచ్చిన భారతీయ ప్రయాణికుడి నుంచి స్మగుల్డ్ బంగారాన్ని కస్టమ్స్ అధికారులు జప్తు చేశారు. నివియా క్రీమ్ బాక్స్‌లు, టైగర్ బామ్ బాటిళ్లలోపల భద్రపరిచిన బంగారం సదరు ప్రయాణికుడు తన లగేజీతోపాటు తీసుకు వచ్చాడు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన తర్వాత కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేశారు. అతడి లగేజీని, వ్యక్తిగతంగా సునిశితంగా తనిఖీ చేయడంతో రూ.23,76,471 విలువైన బంగారం దొరికింది.
318 గ్రాముల బరువు గల 18 రెనియం కోటెడ్ స్ట్రిప్స్, నాలుగు నివియా క్రీమ్ బాక్స్‌లు, పది టైగర్ బామ్ బాటిళ్లలో బంగారాన్ని కస్టమ్స్ అధికారులు జప్తు చేశారు. రెనియం కోటెడ్ బంగారం స్ట్రిప్స్‌ను జప్తు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు శుక్రవారం కస్టమ్స్ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. రెనియం గ్రే కలర్లో లభించే అరుదైన వస్తువు అని, దాని రంగు ముసుగులో బంగారం స్మగుల్ చేయొచ్చునని కస్టమ్స్ అధికారి తెలిపారు.