హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ కేంద్రంగా అధునాతన చిన్న ఆయుధాలను తయారు చేస్తున్న మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐల్) గ్రూపు సంస్థ ‘ఐకామ్’ కేంద్ర రిజర్వు పోలీస్ బలగాల (సీఆర్పీఎఫ్)కు 200 సీఎస్ఆర్-338 స్నైపర్ రైఫిల్స్‌ను సరఫరా చేయనున్నది. ఈ ఏడాది చివరినాటికి ఈ ఆయుధాలను సరఫరా చేసేందుకు సీఆర్పీఎఫ్తో ఐకామ్-కారకాల్ ఒప్పందం చేసుకున్నది.
సైనిక దళాలకు, భద్రతా సిబ్బందికి అవసరమయ్యే చిన్నపాటి ఆయుధాలను తయారు చేసే సాంకేతికతను పొందేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కి చెందిన ఎడ్జ్ గ్రూప్ సంస్థ కారకాల్ ఇంటర్నేషనల్‌తో ‘ఐకామ్’ ఒప్పందం కుదుర్చుకున్నది. ఈ సందర్భంగా ‘కారకాల్’ సీఈవో హమాద్ అలామెరి మాట్లాడుతూ.. చిన్న ఆయుధాల సాంకేతిక పరిజ్ఞానం బదిలీలో ఇది చారిత్రాత్మక ఘట్టమని చెప్పారు.
సీఆర్పీఎఫ్తో ఒప్పందం కుదుర్చుకోవడం తమ సంస్థకు ఎంతో గర్వకారణమని ‘ఐకామ్’ డైరెక్టర్ సుమంత్ పాతూరు తెలిపారు. భారత్-యూఏఈ రక్షణ భాగస్వామ్యంలో భాగంగా కారకాల్‌తో కలిసి ఆధునిక చిన్న ఆయుధాలను తయారు చేసేందుకు ‘ఐకామ్’ ఈ ఏడాది ఏప్రిల్‌లో హైదరాబాద్‌లో కేంద్రాన్ని ప్రారంభించింది.