Russia-Ukraine War | ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర ప్రభావం ప్రపంచవ్యాప్తంగా చమురు, సహజ వాయువు ధరలపైనా గట్టిగానే పడుతున్నది. ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లో తొమ్మిదేండ్ల గరిష్ఠాన్ని తాకుతూ బ్యారెల్ ముడి చమురు ధర దాదాపు 111 డాలర్లను చేరింది. అంతర్జాతీయంగా ముడి చమురు ఉత్పత్తిలో రష్యా వాటా 12 శాతంగా ఉన్నది. ఈ క్రమంలో ఉక్రెయిన్‌కు మద్దతుగా రష్యాకు వ్యతిరేకంగా అమెరికా, దాని మిత్ర దేశాలు, ఐరోపా అగ్రదేశాలు విధించిన ఆంక్షలు ఆయా దేశాల దిగుమతులను ప్రభావితం చేస్తున్నాయి. దీంతో స్థానికంగా ఇంధన ధరలు పెరిగే వీలుందని నిపుణులు చెప్తున్నారు. ఇదిలావుంటే సహజ వాయువులో 17 శాతం, బొగ్గులో 5.2 శాతం, కాపర్‌లో 4.3 శాతం, అల్యూమినియం, నికెల్ ఉత్పత్తిలో 6.1 శాతం చొప్పున, జింక్‌లో 15 శాతం, బంగారంలో 9.5 శాతం, వెండిలో 5.4 శాతం, ప్లాటినంలో 14 శాతం, గోధుమల్లో 11 శాతం మేర రష్యా ఉత్పత్తి చేస్తున్నది. వీటి ధరలూ పెరిగే వీలుందని అంటున్నారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం త్వరగా ముగియకపోతే న్యూస్‌ప్రింట్ ధరలు మరింత పెరుగుతాయని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే న్యూస్‌ప్రింట్ ధరలు భారంగా ఉన్నాయని, ఇప్పుడు యుద్ధంతో రవాణా వ్యవస్థకు ఏర్పడే అడ్డంకులు, గ్లోబల్ మార్కెట్లో ఎగబాకుతున్న ముడి చమురు ధరలు.. రేట్లను ఎగదోస్తున్నాయని అంటున్నాయి. మరోవైపు విదేశీ మారకపు మార్కెట్లలో ఒడిదుడుకులు కూడా న్యూస్‌ప్రింట్ ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయని పరిశ్రమ ఆందోళన వ్యక్తం చేస్తున్నది.