Infrastructure Sector | న్యూఢిల్లీ, మార్చి 28: దేశంలోని కీలక రంగాలు కుదేలయ్యాయి. బొగ్గు, ముడి చమురు, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, ఉక్కు, విద్యుత్తు రంగాల్లో వృద్ధిరేటు గత నెల ఫిబ్రవరిలో మందగించడంతో మౌలిక రంగ ప్రగతి 5 నెలల కనిష్ఠాన్ని తాకుతూ 2.9 శాతానికే పరిమితమైంది. గత ఏడాది ఫిబ్రవరిలో ఇది 7.1 శాతంగా ఉండటం గమనార్హం. ఈ మేరకు శుక్రవారం అధికారిక గణాంకాలు విడుదలయ్యాయి. ఈ ఏడాది జనవరిలో కూడా 5.1 శాతంగా వృద్ధి నమోదైంది. కానీ ఫిబ్రవరిలో చాలాచాలా నిరుత్సాహకరంగా కనిపించింది. గతంతో పోల్చితే ఇంకా తగ్గింది. ఇక నిరుడు సెప్టెంబర్‌లో 2.4 శాతంగా మౌలిక రంగ వృద్ధిరేటు ఉన్నది. మళ్లీ ఆ తర్వాతి స్థాయి ఫిబ్రవరిలోనేనని తాజా లెక్కలు తేటతెల్లం చేస్తున్నాయి.
దిగాలుపడ్డ ఇంధన రంగం
మొత్తం 8 కీలక రంగాల్లో ముడి చమురు, సహజ వాయువు ఉత్పత్తి దారుణంగా దెబ్బతిన్నది. మైనస్‌లోకి వెళ్లిపోయాయి. ఇప్పటికే దేశ ఇంధన అవసరాలు దాదాపు 80 శాతం విదేశీ దిగుమతుల ద్వారానే తీరుతున్నాయి. ఈ క్రమంలో దేశీయంగా ముడి చమురు, సహజ వాయువు ఉత్పత్తి పడిపోతుండటం దేశానికి అన్నివిధాలుగా ఇబ్బందేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేశంలో ఇంధన ఉత్పత్తి పుంజుకోకపోతే భారత ఆర్థిక వ్యవస్థకే ప్రమాదమని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు. ద్రవ్యోల్బణం పెరగడం, దాన్ని అదుపు చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మళ్లీ వడ్డీరేట్లను పెంచుతూపోవడం, తద్వారా బ్యాంకు రుణాలపై వడ్డీరేట్లు పెరిగి వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో అభివృద్ధి కుంటుపడటం, పెరిగే ముడి చమురు దిగుమతులతో దేశంలోని విదేశీ మారకపు నిల్వలు క్షీణించడం.. ఇలా అనేకానేక సమస్యలు వచ్చిపడుతాయని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. కాబట్టి ముడి చమురు, సహజ వాయువు ఉత్పత్తి తిరిగి పెరిగేలా చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు.
ఇతర రంగాల్లో..
బొగ్గు, రిఫైనరీ ఉత్పత్తులు, ఉక్కు, విద్యుదుత్పత్తి రంగాలు కూడా నిరాశాజనకంగానే సాగుతున్నాయి. గత నెల బొగ్గు ఉత్పత్తి 1.7 శాతం, రిఫైనరీ ఉత్పాదక కార్యకలాపాలు 0.8 శాతం, ఉక్కు తయారీ 5.6 శాతం, విద్యుదుత్పత్తి 2.8 శాతం మేరకే పెరిగాయి. అయితే నిరుడు ఫిబ్రవరిలో ఇవి వరుసగా 11.6 శాతం, 2.6 శాతం, 9.4 శాతం, 7.6 శాతం చొప్పున వృద్ధిని కనబర్చాయి. నిజానికి ఈసారి ఎరువులు, సిమెంట్ ఉత్పత్తి జోరుగా సాగింది. గతంతో పోల్చితే 10.2 శాతం, 10.5 శాతం చొప్పున పెరిగింది. అయినప్పటికీ ముడి చమురు, సహజ వాయువుల ఉత్పత్తి దిగజారడం.. బొగ్గు, రిఫైనరీ , ఉక్కు, విద్యుదుత్పత్తి అంతంతమాత్రంగానే ఉండటంతో ఆ పెరుగుదల ప్రభావం చూపలేకపోయింది.
ఈ ఆర్థిక సంవత్సరంలోనూ..
గత ఆర్థిక సంవత్సరం (2023-24)తో పోల్చితే ఈ ఆర్థిక సంవత్సరం (2024-25)లోనూ కీలక రంగాల పనితీరు నిరుత్సాహకరంగానే కొనసాగుతున్నది. ఈసారి ఏప్రిల్-ఫిబ్రవరిలో 8 కీలక రంగాల్లో ప్రగతి 4.4 శాతంగానే ఉంటే.. పోయినసారి 7.8 శాతంగా ఉన్నది మరి. దీంతో ఆయా రంగాల్లో నిస్తేజం ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక బొగ్గు, ముడి చమురు, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, ఉక్కు, విద్యుత్తు, ఎరువులు, సిమెంట్ రంగాల వాటా దేశ పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ)లో ఏకంగా 40.27 శాతం. దీంతో ఈ రంగాల్లో మందగమనం.. యావత్తు ఇండస్ట్రీ తీరుతెన్నులను, దేశ జీడీపీ గణాంకాలనూ పెద్ద ఎత్తునే ప్రభావితం చేసే వీలున్నది. దాంతో వీటి వృద్ధిపై దృష్టి సారించాలన్న సూచనలు ఇప్పుడు మోదీ సర్కారుకు వస్తున్నాయి.