ముంబై, మే 6: బంగారాన్ని తాకట్టుపెట్టి తీసుకునే రుణాలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెచ్చిన ముసాయిదాలో ప్రతిపాదించిన మార్గదర్శకాల అమలు బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ)లకు ఇబ్బందేనని దేశీయ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ మంగళవారం విడుదల చేసిన ఓ నివేదికలో అభిప్రాయపడింది. దీనివల్ల ఆస్తుల వృద్ధి నెమ్మదిస్తుందని పేర్కొన్నది. లోన్ టు వాల్యూ, రెన్యువల్/బుల్లెట్ లోన్స్ టాప్-అప్లపైనే ఆర్బీఐ డ్రాఫ్ట్ గైడ్‌లైన్స్ ప్రధాన లక్ష్యంగా ఉన్నట్టు తెలిపింది. కాగా, ఈ డ్రాఫ్ట్‌ను గత నెల ఏప్రిల్‌లో ఆర్బీఐ తీసుకొచ్చింది. రుణాల మంజూరులో ఆయా సంస్థలు అనుసరిస్తున్న విధానాల్లో ఉన్న తేడాలను సరిచేసేందుకే ఇది అంటూ ఆర్బీఐ చెప్తున్నది.
రూ.2,400 పెరిగిన పసిడి ధర
బంగారం ధరలు మళ్లీ పుంజుకుంటున్నాయి. దేశీయ మార్కెట్లో తులం విలువ మరోసారి లక్ష రూపాయలకు చేరువైంది. మంగళవారం ఒక్కరోజే ఢిల్లీలో 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) 10 గ్రాములు రూ.2,400 ఎగిసి రూ.99,750కి చేరింది. దీంతో వరుసగా మూడోరోజూ రేట్లు ఎగబాకినైట్టెంది. జ్యుయెల్లర్స్, ఇన్వెస్టర్లు పసిడి కొనుగోళ్లకు ప్రాధాన్యతనిస్తుండటమే కారణమని అఖిల భారత సరఫా అసోసియేషన్ తెలిపింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌లతోపాటు, అమెరికా రిజర్వ్ బ్యాంకైన ఫెడ్ రిజర్వ్ బుధవారం జరిపే ద్రవ్యసమీక్ష సైతం ధరల పెరుగుదలకు దారితీస్తున్నాయని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇక వెండి ధర కూడా కిలో రూ.1,800 ఎగిసి రూ.98,500 వద్ద నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ 45.65 డాలర్లు పెరిగి 3,379.77 డాలర్లను తాకింది. వెండి 33 డాలర్లుగా ఉన్నది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ పుత్తడి రేటు తులం రూ.2,730 ఎగిసి రూ.98,460 వద్ద ఆగింది. 22 క్యారెట్ రూ.2,500 ఎగబాకి రూ.90,250గా ఉన్నది. అలాగే ఫ్యూచర్ మార్కెట్ విషయానికొస్తే.. మల్టీ కమోడిటీ ఎక్సేంజ్‌పై జూన్ నెల డెలివరీకిగాను గోల్డ్ కాంట్రాక్ట్స్ ట్రేడింగ్ రూ.1,613 పుంజుకొని రూ.96,262 పలికింది.