Credit Cards | ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆఫ్‌లైన్‌లో షాపింగ్ చేసినా.. ఆన్లైన్లో కొనుగోళ్లు జరిపినా.. పేమెంట్స్ కోసం క్రెడిట్ కార్డులనే వాడుతున్నారు. చెల్లింపుల్లో డిజిటలైజేషన్ పెరిగిపోయింది.. తదనుగుణంగా క్రెడిట్ కార్డుల వాడకం కూడా ఇటీవల బాగా పెరిగింది. బ్యాంకులు కూడా క్రెడిట్ రిస్క్ లేని ఖాతాదారులకు మాత్రమే క్రెడిట్ కార్డులు జారీ చేయడానికి ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే క్రెడిట్ కార్డులు గల వారు తమ కార్డ్ అప్‌గ్రేడ్ చేయడానికి ముందు కొన్ని అంశాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు.
పెట్రోల్ బంక్.. గ్రాసరీ స్టోర్స్ వంటి పేమెంట్స్‌కు క్రెడిట్ కార్డులు వాడుతూ ఉంటాం.. ఏయే అవసరాలకు క్రెడిట్ కార్డులను యూజ్ చేస్తున్నామో.. ఆ క్యాటగిరీల్లో ఎక్కువ ప్రయోజనాలు కల్పించే క్రెడిట్ కార్డును ఎంచుకోవడం వల్ల లబ్ధి పొందొచ్చు. ప్రాథమికంగా క్రెడిట్ కార్డులు వార్షిక ఫీజు లేకుండా తక్కువ ఫీజు వసూలు చేస్తాయి. కానీ మెరుగైన ఫీచర్లు గల క్రెడిట్ కార్డు కావాలంటే మాత్రం ఎక్కువ వార్షిక ఫీజు పే చేయాల్సిందే.
తొలిసారి క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు క్రెడిట్ కార్డు జారీ సంస్థలు బేసిక్ ఫీచర్లతో కూడిన క్రెడిట్ కార్డులు మాత్రమే ఇస్తాయి. కొత్తగా క్రెడిట్ కార్డులు వాడే వారికి ఇవి యూజ్‌ఫుల్‌గా, అనుకూలంగా ఉంటాయి. ప్రీమియం కార్డుల స్థాయిలో రివార్డులు, క్యాష్‌బ్యాక్, ట్రావెల్ బెనిఫిట్లు, లాంజ్ యాక్సెస్ వంటి ఆకర్షణీయ బెనిఫిట్లు ఉండవు. కానీ, మీ ఇన్‌కం పెరుగుతున్నట్లే క్రెడిట్ కార్డు లావాదేవీలు ఎక్కువ అవుతాయి. సిబిల్ స్కోర్ కూడా మెరుగయ్యాక.. అధిక బెనిఫిట్లు ఇచ్చే క్రెడిట్ కార్డుకు మారొచ్చు.
అన్ని ఖర్చులపై సాధారణ బెనిఫిట్లు అందించినా.. క్రెడిట్ కార్డులతో.. ప్రయాణాలు, పెట్రోల్ లేదా డీజిల్ లేదా సీఎన్జీ గ్యాస్, షాపింగ్ వంటి ఖర్చులపైనే ఎక్కువ బెనిఫిట్లు పొందొచ్చు. ప్రయాణాలకు టికెట్ల బుకింగ్‌పై ట్రావెల్ క్రెడిట్ కార్డులు అదనపు రివార్డులు / రాయితీ ఆఫర్లు, కాంప్లిమెంటరీ ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ / ఉచిత విమాన టికెట్ వంటి బెనిఫిట్లు లభిస్తాయి. పెట్రోల్ లేదా డీజిల్ లేదా సీఎన్జీ గ్యాస్ వినియోగ కార్డుల వాడకంతో పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లపై పెట్రోల్ పంపుల వద్ద రాయితీ లభిస్తుంది.
కనుక మీరు ఎక్కువ ఖర్చు చేస్తున్న క్యాటగిరీలను గుర్తించి, ఆ విభాగంలో క్రెడిట్ కార్డును అప్‌గ్రేడ్ చేసుకుంటే అధిక బెనిఫిట్లు పొందొచ్చు. మీకవసరమైన క్రెడిట్ కార్డు రకం తెలుసుకున్న తర్వాత నిబంధనలతోపాటు కార్డులో లభించే ఫీచర్ల గురించి కూడా తెలుసుకోవాలి. కొన్ని క్రెడిట్ కార్డులు సెలెక్టెడ్ బ్రాండ్లు, ఆన్లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్‌లపైనే బెనిఫిట్లు అందిస్తాయి. ఆ బ్రాండ్లు, ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లపై ఎక్కువ షాపింగ్ చేసే వారు మాత్రమే ఈ క్రెడిట్ కార్డులు తీసుకోవాలి.
బెటర్ బెనిఫిట్లతో కూడిన క్రెడిట్ కార్డు వస్తుందనుకుంటే.. వార్షిక ఫీజు కూడా ఎక్కువే ఉంటుంది. బ్యాంకు విధించే వార్సిక ఫీజును సంబంధిత క్రెడిట్ కార్డుపై మీరు పొందే బెనిఫిట్లు అధిగమించే అవకాశాలు ఉన్నాయా? అన్నది అనలైజ్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే క్రెడిట్ కార్డు అప్‌గ్రేడ్ చేసుకోవాలి.
కొన్ని సంస్థలు తమ క్రెడిట్ కార్డుల యూజర్లకు ముందే కనీస వ్యయ పరిమితిని ఖరారు చేస్తాయి. ఆ లిమిట్ దాటి ఖర్చు చేస్తే వార్షిక ఫీజు తిరిగి చెల్లించాలి. మీ కుటుంబం ఖర్చులు ఈ లిమిట్‌ను దాటేలా ఉంటేనే క్రెడిట్ కార్డు అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. వార్షిక ఫీజు మాఫీ కోసమే ఎక్కువ క్రెడిట్ కార్డు వాడొద్దని నిపుణులు హితవు చెబుతున్నారు.
క్రెడిట్ కార్డు అప్‌గ్రేడ్‌తో క్రెడిట్ లిమిట్ కూడా పెరుగుతుంది. ఇది పలు రకాలుగా ఉపకరిస్తుంది. కొనుగోలు శక్తి పెరగడంతోపాటు ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఎక్కువ మొత్తం వాడకానికి అవకాశం లభిస్తుంది. క్రెడిట్ వినియోగ నిష్పత్తి తగ్గుతుంది. ఎక్కువ పరిమితితో కూడిన క్రెడిట్ కార్డు ఇస్తున్నప్పుడు బ్యాంకులు.. మీ ఇన్కంతోపాటు పలు అంశాలను పరిగణనలోకి తీసుకుంటాయి.
కొత్త క్రెడిట్ కార్డుకు అప్‌గ్రేడ్ కావడానికి ముందు ప్రస్తుత కార్డులో గల రివార్డ్ బ్యాలెన్స్, క్యాష్ బ్యాక్ చెక్ చేసుకోవాలి. ఇది మీ ఖాతాకు ఇంకా క్రెడిట్ కాకపోవచ్చు. కనుక కొత్తగా అప్‌గ్రేడ్ అయ్యే క్రెడిట్ కార్డులో మా పాత కార్డు రివార్డుల బ్యాలెన్స్ బదిలీ అవుతుంది లేదా చెక్ చేసుకోవాలి. అలా ట్రాన్స్ఫర్ కాకుంటే పాత కార్డు రివార్డ్ పాయింట్లను రిడీమ్ చేసుకుంటే.. క్రెడిట్ కార్డుతో పొందిన రివార్డు పాయింట్లను సద్వినియోగం చేసుకోవచ్చు.