యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ)తో క్రెడిట్ కార్డుల అనుసంధానానికి రిజర్వ్ బ్యాంక్ అనుమతించింది. దీంతో మరింత మందికి యూపీఐ సేవలు దరిచేరినైట్టెంది. ఇప్పటిదాకా కేవలం డెబిట్ కార్డులే యూపీఐతో అనుసంధానమై ఉన్నాయి. దీంతో గూగుల్‌పే, ఫోన్‌పే, పేటీఎం వంటి యూపీఐ యాప్‌ల ద్వారా సేవింగ్స్, కరెంట్ అకౌంట్ డెబిట్ కార్డు వినియోగదారులు అన్ని రకాల చెల్లింపులు చేయగలుగుతున్నారు.
త్వరలో క్రెడిట్ కార్డు వినియోగదారులకూ ఈ అవకాశం రానున్నట్టు ఆర్బీఐ తెలిపింది. ఫలితంగా క్రెడిట్ కార్డు యూజర్లూ వాటిని ఉపయోగించి యూపీఐ యాప్‌ల ద్వారా ఆయా చెల్లింపులు చేసుకునేందుకు వీలు చిక్కుతున్నది. యూపీఐ చెల్లింపులు ప్రస్తుతం ఉచితంగానే ఉండగా, మర్చంట్ డిస్కౌంట్ రేటుపై ఆధారపడి క్రెడిట్ కార్డు కంపెనీలు చార్జ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో యూపీఐ-క్రెడిట్ కార్డు సేవలపై బ్యాంకులు, వ్యవస్థీకృత సంస్థలు ధరల్ని నిర్ణయిస్తాయని ఆర్బీఐ వర్గాలు చెప్తున్నాయి.
కాగా, ఆర్బీఐ ఆధ్వర్యంలోని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) జారీ చేసిన రూపే క్రెడిట్ కార్డులతో తొలుత ఈ ప్రక్రియ మొదలు కానున్నది. యూపీఐ వినియోగదారులు 26 కోట్లపైనే ఉండగా, మరో 5 కోట్ల మంది వ్యాపారులు దీన్ని వాడుతున్నారు. యూపీఐ ద్వారా మే నెలలో రూ.10.4 లక్షల కోట్ల విలువైన లావాదేవీలు జరిగినట్టు ఆర్బీఐ చెప్తున్నది.