HDFC Credit Card | ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కొత్త క్రెడిట్ కార్డుల జారీలో దూకుడు మీదున్నది. దేశీయ క్రెడిట్ కార్డుల మార్కెట్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ది 29 శాతం. ఆర్బీఐ నిషేధం విధించడంతో రెండేండ్లుగా కొత్త క్రెడిట్ కార్డులు జారీ చేయలేదు. తాజాగా నిషేధం ఎత్తివేయడంతో ఇక నుంచి దూకుడుగా కొత్త క్రెడిట్ కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. ప్రతి నెలా 10 లక్షల కొత్త క్రెడిట్ కార్డులు జారీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది.
లక్ష్యాన్ని సాధించుకోవడానికి ఆన్లైన్, రిటైల్, ఫుడ్ డెలివరీ యాప్లతో భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకుంటామని బ్యాంకు పేమెంట్స్ బిజినెస్, కన్జూమర్ ఫైనాన్స్, డిజిటల్ బ్యాంకింగ్ అండ్ మార్కెటింగ్ కంట్రీ హెడ్ పరాగ్ రావు చెప్పారు. రెండు విమానయాన సంస్థలు, ఒక అతిపెద్ద హోటల్ నెట్వర్క్తో భాగస్వామ్యం ఒప్పందాలు కుదరనున్నాయని ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.
కొత్తగా జారీ చేసే క్రెడిట్ కార్డులతో కస్టమర్లకు అధిక బెనిఫిట్లు కల్పించడమే తమ బ్యాంకు లక్ష్యమని పరాగ్రావు వెల్లడించారు. ప్రత్యేకించి యువతను ఆకర్షించడానికి త్వరలో విడుదల చేయనున్న డిజిటల్ కార్డు తుది దశకు చేరుకున్నదన్నారు. వినియోగదారులను ఆకర్షించడానికి ఇతర క్రెడిట్ కార్డు సంస్థల మాదిరిగా భారీ రివార్డులు ఇవ్వబోమని అన్నారు. ఇంతకుముందు కస్టమర్లను ఆకర్షించడానికి భారీ డిస్కౌంట్లు ఇవ్వలేదని, ఇక ముందు ఆ ఆలోచన లేదని స్పష్టం చేశారు.