Credit Card | క్రెడిట్ కార్డ్ కల్పించే వెసులుబాట్లు ఎన్ని ఉన్నాయో.. దాన్ని విచక్షణ లేకుండా ఉపయోగిస్తే అంతకన్నా ఎక్కువ కష్టాలే ఉన్నాయి. వడ్డీలేని పీరియడ్ చెల్లింపులు చేస్తూ సక్రమంగా వినియోగించగలిగితే రివార్డులు, బోనస్ పాయింట్లతో చాలానే ప్రయోజనాలను పొందవచ్చు. అలాగే క్రెడిట్ కార్డును పద్ధతిగా వాడితే క్రెడిట్ స్కోర్‌ను కూడా పెంచుకోవచ్చు. అయితే కార్డు ఉంది కదా.. అని విచ్చలవిడిగా గీకి పారేస్తే అప్పుల ఊబిలో కూరుకుపోవడం ఖాయం. ఈ ప్రమాదాన్ని కొన్ని సంకేతాలతో మనం ముందుగానే గుర్తించవచ్చు.
క్రెడిట్ కార్డు గడువు సమయంలో కనీసంగా చెల్లించాల్సిన 5 శాతం సొమ్మునే చెల్లిస్తూ మిగతా మొత్తాన్ని రివాల్వింగ్ క్రెడిట్‌గా మార్చడం.. అప్పుల ఊబిలోకి జారుకుంటున్నట్టు చెప్పడానికి తొలి సంకేతం. క్రెడిట్ లిమిట్‌ను 80 శాతం కన్నా ఎక్కువ తీసుకుని కేవలం 5 శాతం కనీస మొత్తాన్ని చెల్లిస్తూపోతే.. మీ జీవితాంతం చెల్లించినా ఆ అప్పు తీరదు. వార్షిక వడ్డీ 45 శాతం వరకూ ఉంటుంది. దానిపై జీఎస్టీ, ఇలా చార్జీలకే మీ ఐదు శాతం సొమ్ము సరిపోదు. ఆ తర్వాత ఏ ఖర్చు చేయకపోయినా సరే అప్పు పెరగడమే తప్ప తరగడం అంటూ ఉండదు. ఐదు శాతం చెల్లించడం ఓ తప్పనిసరి పరిస్థితిలో మరిన్ని చార్జీలు పడకుండా ఉండే ఓ వెసులుబాటే తప్ప.. దానివల్ల ఏ మాత్రం రుణభారం తగ్గదు.
క్రెడిట్ కార్డు మీద ఉన్న పరిమితి మొత్తాన్ని ఉపయోగించి కొనుగోళ్లు జరపడం కూడా ప్రమాదమే. నిర్ణీత వ్యవధిలో తిరిగి చెల్లించడం కష్టమే. మొత్తం పరిమితిని ఉపయోగించడం వల్ల క్రెడిట్ స్కోర్ కూడా దెబ్బతింటుంది. అప్పు మీదనే మీరు ఆధార పడుతున్నారన్న అంచనాకు క్రెడిట్ బ్యూరోలు వస్తాయి. అలాంటి సందర్భంలో కొత్త రుణాన్ని తీసుకోవడమూ గగనమే అవుతుంది. క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో (సీయూఆర్)ను గమనిస్తూ ఉండండి. మీకున్న పరిమితిలో 40 నుంచి 50 శాతానికి మించకుండా క్రెడిట్ పరిమితిని ఉపయోగించండి.
క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ తేదీ నుంచి చెల్లించే గడువు తేదీకి మధ్య ఉండే సమయమే ఇది. సాధారణంగా ఈ వ్యవధి 18 నుంచి 55 రోజుల వరకు ఉంటుంది. గడువు తేదీలోగా ఆ నెలలో ఖర్చు చేసిన మొత్తాన్ని చెల్లించగలిగినప్పుడే ఎలాంటి వడ్డీలు, చార్జీలు లేకుండా బయటపడవచ్చు. ఈ గడువులోగా చెల్లించగలిగే ఎంత మొత్తాలకైనా మీరు కొనుగోళ్లు జరపవచ్చు. వాటికి రివార్డ్ పాయింట్లనూ పట్టవచ్చు. ఒక్కసారి ఈ చెల్లింపుల క్రమం తప్పితే ఇకఅంతే సంగతులు. కేవలం కనీస మొత్తాన్నో లేక కొంత మొత్తాన్నో చెల్లిస్తే వడ్డీ భారంతోపాటు చార్జీల భారాన్ని కూడా మోయక తప్పదు.
క్రెడిట్ కార్డు ద్వారా ఎటీఎం నుంచి నగదును విత్‌డ్రా చేస్తున్నారంటేనే మీరు అత్యంత దయనీయమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని అర్థం. నగదు విత్‌డ్రా చేసిన మరుక్షణం నుంచే క్యాష్ అడ్వాన్స్ ఫీజు కింద 3.5 శాతం భారం పడుతుంది. ఆ తర్వాత విత్‌డ్రా చేసిన నగదు మీద గరిష్ఠంగా 49 శాతం వరకు వార్షిక వడ్డీ పడుతుంది. ఈ చార్జీలు, వడ్డీ విత్‌డ్రా చేసిన రోజు నుంచే అమల్లోకి వస్తాయి. విత్‌డ్రా చేసిన మొత్తాన్ని మీరు వెంటనే చెల్లించకపోతే చార్జీల మీద చార్జీలు పడుతూనే ఉంటాయి తస్మాత్ జాగ్రత్త. అంతగా అవసరమైతే క్రెడిట్ కార్డు మీద పర్సనల్ లోన్ తీసుకోండి. ఇది చవక మాత్రమేగాక వెంటనే జారీ కూడా అవుతుంది.
సాధారణంగా క్రెడిట్ కంపెనీలు కార్డు మీద కొనుగోళ్లను పెంచడానికి రివార్డ్ పాయింట్లను ఇస్తాయి. వీటిని కొంత కాలపరిమితిలోగా ఉపయోగించాల్సి ఉంటుంది. వీటిని కొన్ని కొనుగోళ్లకు ఉపయోగించవచ్చు. ఎయిర్ మైల్స్, హోటల్ వోచర్స్, పెట్రోల్ ఇలా అనేక ఖర్చులకు రివార్డు పాయింట్లతో చెల్లింపులు జరపవచ్చు. వీటిని ఉపయోగించలేకపోతే మీకు రావాల్సిన ప్రయోజనాలు కూడా రాకుండా పోతాయి. క్రెడిట్ కార్డును ఈ రివార్డ్ పాయింట్ల కోసమే అన్నట్టుగా కూడా ఉపయోగించరాదు. మనం అవసరాలకు తగ్గట్టుగా ఉపయోగించగా వచ్చిన అదనపు ప్రయోజనాలను సక్రమంగా ఉపయోగించుకుంటే చాలు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
Petrol Saving with Credit Card | క్రెడిట్ కార్డులతో ఇలా పెట్రోల్ ఆదా..
SBI Card | ఎస్బీఐ యూజర్లకు షాక్.. ఈఎంఐ పెడితే తడిచిమోపెడు కావాల్సిందే !
Credit Card | క్రెడిట్ కార్డుతో జర జాగ్రత్త