న్యూఢిల్లీ, ఆగస్టు 31: భారత్ స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటు ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో భారీగా పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో జీడీపీ 20.1 శాతం వృద్ధిచెందినట్లు నేషనల్ స్టాటస్టికల్ ఆఫీస్ (ఎన్ఎస్వో) మంగళవారం వెల్లడించింది. ఈ గణాంకాల ప్రకారం ఈ ఏడాది ప్రపంచంలో అత్యంతవేగంగా వృద్ధిచెందిన ఆర్థిక వ్యవస్థగా భారత్ నమోదయ్యే అవకాశం వుంది. అయితే ఈ వృద్ధి రేటుతో ఆర్థిక వ్యవస్థ జోరుగా కోలుకున్నట్లు భావించరాదు. గతేడాది కరోనా సంక్షోభం కారణంగా ఏర్పడిన లోబేస్ ఎఫెక్ట్‌తో ఈ జూన్ త్రైమాసికంలో భారీ వృద్ధి సాధ్యపడింది. 2020 ఏప్రిల్-జూన్ మూడు నెలలకాలంలో జీడీపీ మైనస్ వృద్ధిని (-24.4 శాతం) నమోదుచేసింది. ఆ నెలల్లో దేశవ్యాప్తంగా కఠినమైన లాక్డౌన్ ఆంక్షలు కొనసాగిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఏడాది జనవరి-మార్చి క్వార్టర్లో ఈ వృద్ధి 1.6 శాతం. 2020-21 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 7.3 శాతం క్షీణించింది. ఈ ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో వెల్లడైన వృద్ధిరేటు రిజర్వుబ్యాంక్ అంచనా రేటు 21.4 శాతంకంటే తక్కువగానే నమోదుకావడం గమనార్హం.
కొవిడ్ ముందస్తుస్థాయి కంటే తక్కువే…
తాజాగా ముగిసిన త్రైమాసికంలో 2011 -12 ధరల ప్రకారం జీడీపీ రూ. 32,38,020 కోట్లుకాగా, కొవిడ్ తొలివేవ్ సంక్షోభకాలమైన 2020 ఏప్రిల్-జూన్‌లో 26,95,421 కోట్లు. కొవిడ్ ముందస్తు సంవత్సరమైన 2019 జూన్ త్రైమాసికంలో రూ.35,66,708 కోట్ల విలువైన జాతీయోత్పత్తి జరిగింది. కొవిడ్ సెకండ్‌వేవ్ కారణంగా 2021-22 తొలి త్రైమాసికంలో పలు రాష్ర్టాల్లో లాక్డౌన్లు జరిగాయని, ఈ నియంత్రణల కారణంగా ఆర్థిక కార్యకలాపాలు, గణాంకాల సేకరణ యంత్రాంగాలపై కూడా ప్రభావం పడిందని, దీంతో త్రైమాసిక జీడీపీ అంచనాలు కూడా ప్రభావితమై ఉండవచ్చని ఎన్ఎస్వో విడుదల చేసిన ప్రకటన తెలిపింది. వ్యవసాయ రంగం మినహా మిగిలిన రంగాలన్నీ కొవిడ్ ముందస్తుస్థాయికంటే తక్కువగానే ఉన్నాయి. తయారీ రంగం 2019 ఏప్రిల్-జూన్‌లో రూ.5.67 లక్షల కోట్లుకాగా, ఈ జూన్ క్వార్టర్లో ఇది రూ.5.43 లక్షల కోట్లు. సర్వీసుల రంగం రూ.6.64 లక్షల కోట్ల నుంచి రూ.4.63 కోట్లకు తగ్గగా, వ్యవసాయ రంగం రూ.4.49 లక్షల కోట్ల నుంచి రూ. 4.86 లక్షల కోట్లకు పెరిగింది.
చైనాను మించవచ్చన్న అంచనాలు…
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ 9.5 శాతం వృద్ధి సాధించవచ్చని రిజర్వుబ్యాంక్, ఐఎంఎఫ్, ఎస్ అండ్ పీ రేటింగ్స్ అంచనావేస్తుండగా, మూడీస్ 9.3 శాతం వృద్ధి అంచనాల్ని ప్రకటించింది. ఫిచ్ రేటింగ్స్ 10 శాతం వృద్ధిని అంచనా వేస్తున్నది. 8.3 శాతం వృద్ధిని అంచనావేస్తున్నట్లు ప్రపంచబ్యాంక్ పేర్కొంది. ప్రపంచ ప్రధాన ఆర్థిక వ్యవస్థలన్నింటిపై ఉన్న వృద్ధి అంచనాలకంటే భారత్‌పై అంచనాలు అధికంగా ఉన్నాయి. చైనా వృద్ధిరేటు అంచనా 8.5 శాతంకాగా, పలు ఏజెన్సీలు భారత్ ఆర్థిక వ్యవస్థ ఇంతకంటే బలంగా పుంజుకోగలదన్న అంచనాలతో ఉండటం గమనార్హం.
ఎన్ఎస్వో గణాంకాల వివరాలివీ…
తదుపరి త్రైమాసికాల్లో వృద్ధికి ఇది పునాది
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో సాధించిన జీడీపీ వృద్ధి…తదుపరి త్రైమాసికాల్లో సాధించబోయే వృద్ధికి పునాది. వచ్చే కొద్దివారాల్లో జీడీపీ వృద్ధిరేటు అంచనాలు పెరుగుతాయి. మూలధన వ్యయాల్ని పెంచడంపై ప్రభుత్వం దృష్టిపెడుతున్నందున, ఆశించిన ఫలితాలు వస్తాయ్.
రాజీవ్ కుమార్, నీతి అయోగ్ వైస్ చైర్మన్
భారత్ స్థూల ఆర్థిక ఫండమెంటల్స్ బలంగా ఉన్నాయి. వ్యవస్థాగత సంస్కరణలు, ప్రభుత్వ మూలధన వ్యయం, వ్యాక్సినేషన్ వేగంగా జరుగుతున్న నేపథ్యంలో దేశం పటిష్టవృద్ధిని సాధిస్తుంది. వచ్చే కొద్దినెలల్లో ద్రవ్యోల్బణం 6 శాతంలోపుగానే ఉంటుంది.
కేవీ సుబ్రమణియన్, చీఫ్ ఎకనామిక్ అడ్వయిజర్
కొవిడ్ సెకండ్‌వేవ్‌తో ఆర్థిక కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం పడినా క్యూ1లో జీడీపీ చెప్పుకోదగ్గరీతిలో కోలుకుంది
–సీఐఐ
గత కొద్ది త్రైమాసికాలుగా ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణల ఫలితంగా
గతేడాది కనిష్ఠస్థాయి నుంచి
ఆర్థిక వ్యవస్థ కోలుకుంది.
-పీహెచ్‌డీసీసీఐ