Costly Pent House | దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబైకి ఇండియాలోనే అత్యంత కాస్ట్లీ సిటీగా పేరు.. సకల సౌకర్యాలతో సొంతింటిని కొనుగోలు చేయాలంటే రూ.కోట్లలో ఖర్చు చేయాల్సిందే. ఒక సాధారణ అపార్ట్మెంట్ ప్లాట్ ధరే రూ.కోటి ఉంటుందని మార్కెట్ వర్గాలు చెబుతుంటాయి. ఇక విలాసవంతమైన సౌకర్యాలున్న అపార్ట్మెంట్ అంటే రూ.కోటికి పైగా కుమ్మరించాల్సిందే మరి.
అయితే, ముంబైలోని ఓ అపార్ట్మెంట్పై గల పెంట్ హౌస్ ధర జిగేల్మంటున్నది. ఒకటి కాదు రెండు కాదు.. పది కాదు.. అక్షరాల రూ.230 కోట్లు. ఈ ఏడాది ఇప్పటి వరకు జరిగిన రెండో అతిపెద్ద రియాల్టీ డీల్ ఇదేనని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ముంబైలోని వర్లీ- డాక్టర్ అనిబిసెంట్ రోడ్లో ఒబేరాయ్ రియాల్టీ, సహానా అనే రియాల్టీ సంస్థ కలిసి 360 వెస్ట్ అనే పేరుతో లగ్జరీ అపార్ట్మెంట్లను నిర్మిస్తున్నాయి. ఈ టవర్లలో బీ-టవర్లో 63వ అంతస్తుపై
29,885 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఓ లగ్జరీ పెంట్ హౌస్ కూడా నిర్మించారు.
ట్రిపుల్ బెడ్ రూం గల ఈ పెంట్ హౌస్ వెల్స్పన్ గ్రూప్ చైర్మన్ బీకే గోయెంకా రూ. 230.55 కోట్లకు సొంతం చేసుకున్నారు. ఇటీవలే ఇదే టవర్ల పరిధిలో డీ-మార్ట్ అధినేత రాధాకిషన్ దమానీ కుటుంబం రూ.1,238 కోట్లు ఖర్చు చేసి 28 ఫ్లాట్లు కొన్నది. ముంబై సిటీలోనే అత్యంత కాస్ట్లీ ప్రాంతంగా వర్లీకి పేరు. దీంతోపాటు బీచ్ వ్యూ బాగా ఉండటంతో ఈ అపార్ట్మెంట్లు భారీ ధర పలుకుతున్నాయని రియాల్టీ నిపుణులు చెబుతున్నారు.