Home-Vehicle Loans | పెరుగుతున్న ధరలను కట్టడి చేయడానికి ఆర్బీఐ వడ్డీరేట్లు పెంచింది.. మరోవైపు కరోనా తర్వాత ప్రజలు పర్సనల్ మొబిలిటీకి, సొంతింటికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఫలితంగా ప్రజల వినియోగం రోజురోజుకు పెరుగుతూ పోతున్నది. బ్యాంకుల్లో రిటైల్ రుణాలకు డిమాండ్ ఎక్కువైంది. ఈ ఏడాది జనవరిలో బ్యాంకుల రిటైల్ రుణాలు 20.4 శాతం పెరిగాయి. 2022 జనవరిలో రూ.32.82 లక్షల కోట్లకు పైగా రుణాలు తీసుకుంటే, ఈ ఏడాది రూ.39.59 లక్షల కోట్లకు చేరుకున్నదని ఐడీబీఐ క్యాపిటల్ సర్వేలో తేలింది.
ఈ రుణాల్లో కన్జూమర్ డ్యూరబుల్స్ రుణాలకు డిమాండ్ చాలా ఎక్కువగా 43.6 శాతం పెరిగింది. గతేడాది జనవరిలో రూ.25,700 కోట్ల రుణాలు ఉంటే, ఈ ఏడాది రూ.36,900 కోట్లకు చేరుకున్నది. ఇక ఇండ్ల రుణాల్లో 15.4 శాతం వృద్ధి నమోదైంది. 2023 జనవరిలో రూ.18.99 లక్షల కోట్ల ఇండ్ల రుణాలు మంజూరయ్యాయి. మొత్తం రుణాల్లో వృద్ధిరేటు 16.7 శాతం రికార్డయింది. గత డిసెంబర్లో పంపిణీ చేసిన రుణాలతో పోలిస్తే 15.3 శాతం పెరిగింది.
జనవరిలో క్రెడిట్ కార్డు వినియోగం ఆశ్చర్యకరంగా 29.6 శాతం పుంజుకున్నదని నిపుణులు అంటున్నారు. ప్రతి చిన్న అవసరాలకు కూడా ప్రజలు రుణాలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. ఈజీ మనీ ధోరణి ప్రజల్లో పెరుగుతున్నదని ఆర్థికవేత్తలు, బ్యాంకింగ్ నిపుణులు చెబుతున్నారు. ఒకవైపు రుణాలకు డిమాండ్ పెరుగుతూ ఉంటే, మరోవైపు అందుకు సరిపడా నిధులు బ్యాంకుల వద్ద లేవు. బ్యాంక్ ఆఫ్ బరోడా నిర్వహించిన సర్వే నివేదిక ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి దాదాపు రూ.4 లక్షల కోట్ల నిధుల కొరత తలెత్తుతుందని అంచనా.