Booster Dose for Bankers | కరోనా న్యూ వేరియంట్ ఒమిక్రాన్ కేసులు విజృంభిస్తుండటంతో బూస్టర్ డోస్ కావాలనే వారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. బ్యాంక్ ఉద్యోగులను ఫ్రంట్‌లైన్ వర్కర్లుగా పరిగణించాలని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్పిడరేషన్ కరోంది. కరోనాను నియంత్రించడానికి బ్యాంకుల్లో ఐదు రోజుల పనివారాన్ని ప్రారంభించాలని సూచించింది.
ప్రస్తుతం వివిధ బ్యాంకుల శాఖలు, కార్యాలయాలు 50 శాతం ఉద్యోగులతోనే విధులు నిర్వర్తిస్తున్నాయి. మిగతా 50 శాతం మంది వర్క్ ఫ్రం హోం సేవలందిస్తున్నారు. బ్యాంకర్లకు స్పెషల్ స్టేటస్ ఇచ్చి..అత్యవసర సర్వీసుల విభాగం కింద సబర్బన్ రైల్వేస్తోపాటు ప్రజా రవాణా వ్యవస్థను అందుబాటులోకి తేవాలని యూనియన్ ప్రధాన కార్యదర్శి సౌమ్య దత్తా ఆ లేఖలో కోరారు.
ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో హెల్త్ కేర్ వర్కర్లు, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు, 60 ఏండ్లు దాటిన వృద్ధులతోపాటు ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి ఈ నెల 10వ తేదీ నుంచి ప్రికాషన్ డోస్‌లు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. రెగ్యులర్ ఇంటర్వల్స్‌లో బ్యాంక్ సిబ్బందికి యాంటిజెన్ టెస్ట్‌లు నిర్వహించి.. కరోనాను డిటెక్ట్ చేసి ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందించాలని సూచించింది. 2000 మంది బ్యాంక్ ఉద్యోగులకు కరోనా వచ్చినందని ఏఐబీవోసీ తెలిపింది.