న్యూఢిల్లీ, జూలై 8 : భారతీయ స్టాక్ మార్కెట్లలో అక్రమంగా వేల కోట్ల రూపాయల లాభాలను ఆర్జించిన అమెరికా అల్గారిథమ్ ట్రేడింగ్ సంస్థ జేన్ స్ట్రీట్ మోసాలను క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ, కేంద్ర ప్రభుత్వం అడ్డుకోలేకపోయాయని మంగళవారం కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తింది. సెబీ, కేంద్రం నిర్లక్ష్యం వల్ల చిన్న మదుపరుల ప్రయోజనాలకు రక్షణ లేకుండాపోయిందని ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం అధిపతి సుప్రియా శ్రీనాథ్ ఇక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో మండిపడ్డారు. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ మార్కెట్లలో జేన్ స్ట్రీట్ మోసపూరిత చర్యలకు పాల్పడుతున్నా సెబీ ప్రేక్షకపాత్ర వహించడంతో సాధారణ రిటైల్ ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున నష్టపోవాల్సి వచ్చిందన్నారు. ‘ఇంత జరుగుతున్నా గడిచిన నాలుగున్నరేండ్లుగా సెబీ ఎందుకు మొద్దు నిద్రను వీడలేదు.
కండ్లున్నా చూడలేని గుడ్డిదానిలా మార్కెట్ రెగ్యులేటర్ మారిపోయింది. భారత్ నుంచి భారీగా విదేశాలకు జేన్ స్ట్రీట్ నిధులను తరలించింది నిజం కాదా? ఎఫ్ఐఐ తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటేనే సెబీ, కేంద్రం తక్షణం స్పందిస్తాయా? చిన్న మదుపరులు ఎంత నష్టపోయినా పట్టించుకోవా?’ అని నిలదీశారు. నిజానికి 2023 నుంచి ఇప్పటిదాకా జేన్ స్ట్రీట్ చేసిన మోసపూరిత లావాదేవీల విలువే బయటికొచ్చిందని, 2020 లోనే ఆ కంపెనీ దేశీయ కార్యకలాపాలు మొదలయ్యాయని గుర్తుచేసిన సుప్రియా.. అప్పట్నుంచి ఏం జరిగిందో కూడా తెలియాల్సిన అవసరం ఉందన్నారు. ఈడీ, సీబీఐ, ఐటీ, ఇతర దర్యాప్తు ఏజెన్సీల అలసత్వం కూడా ఈ వ్యవహారంలో ప్రస్ఫుటంగా కనిపిస్తున్నదని దుయ్యబట్టారు. మార్కెట్లలో పెట్టుబడులు పెట్టాలంటూ మార్కెట్ గురువుల తరహాలో ప్రజలందరికీ సలహాలిచ్చిన ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలు.. ఈ మోసాలపై ఇన్వెస్టర్లను ఎందుకు అప్రమత్తం చేయలేకపోయారోనని ఎద్దేవా చేశారు.
తీవ్ర ఊగిసలాటల మధ్య మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 270.01 పాయింట్లు పెరిగి 83,712.51 పాయింట్లకు, నిఫ్టీ 61.20 పాయింట్లు అందుకొని 25,522.50 వద్దకు చేరాయి.