Ola Electric Bike | ఎలక్ట్రిక్ టూ వీలర్స్ మార్కెట్లో రారాజుగా కొనసాగుతున్న ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric).. తాజాగా ఎలక్ట్రిక్ మోటారు సైకిల్ ఆవిష్కరణకు సిద్ధమైంది. ఈవీ టూ వీలర్స్‌లో ఓలా ఎలక్ట్రిక్‌కు 30 శాతానికి పైగా మార్కెట్ వాటా ఉంటుంది. ఎస్1 ప్రో, ఎస్1 ఎయిర్, ఎస్1ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్లతో మార్కెట్లో దూసుకెళ్తున్న ఓలా ఎలక్ట్రిక్.. వచ్చే ఆర్థిక సంవత్సరం (2025-26) ప్రథమార్థ భాగంలో తొలి ఎలక్ట్రిక్ మోటారు సైకిల్‌ను ఆవిష్కరించేందుకు సిద్ధమైంది.
స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్ కోసం ఇటీవలే ‘సెబీ’కి డీఆర్‌హెచ్‌పీ సమర్పించిన ఓలా ఎలక్ట్రిక్.. ‘గతేడాది డిసెంబర్లో ఓలా ఎస్1ఎక్స్ (2 కిలోవాట్స్).. 2024-25 ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే ఓలా ఎస్1ఎక్స్ (3 కిలోవాట్స్) కెపాసిటీ గల ఈవీ స్కూటర్ల డెలివరీ ప్రారంభించింది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి అర్థభాగంలో డైమండ్ హెడ్ (Diamond Head), అడ్వెంచర్ (Adventure), రోడ్‌స్టర్ (Roadster), క్రూయిజర్ (Cruiser) మోటారు సైకిళ్లను ఆవిష్కరిస్తుంది’ అని పేర్కొంది.
ఓలా క్రూయిజర్, ఓలా అడ్వెంచర్, ఓలా రోడ్‌స్టర్, ఓలా డైమండ్ హెడ్ పేర్లతో నాలుగు మోటారు సైకిళ్లను గతేడాది ఎం1 సైబర్ రేసర్ కాన్సెప్ట్‌లో ఓలా ఎలక్ట్రిక్ ప్రదర్శించింది. చంకీ టైర్లతో కూడిన అల్లాయ్ వీల్స్, యూఎస్డీ ఫోర్క్స్, ట్విన్ డిస్క్ బ్రేక్ సెటప్‌తో వస్తోంది ఓలా రోడ్ స్టర్. స్లీక్ రాప్ రౌండ్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్, ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడీ వింకర్స్ తదితర ఫీచర్లు ఉంటాయి. వివిధ సెగ్మెంట్లలో విస్తృత శ్రేణి కస్టమర్ల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా వెళుతున్నట్లు ఓలా ఎలక్ట్రిక్ తెలిపింది. దీర్ఘకాలికంగా వ్యూహాత్మకంగా ఎలక్ట్రిక్ మోటారు సైకిళ్ల సెగ్మెంట్లోకి విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నది.