Meta on Elon Musk | ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)పై టెస్లా సీఈఓ, ట్విట్టర్ అధినేత ఎలన్ మస్క్ అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని ఫేస్బుక్ పేరెంట్ సంస్థ మెటా శాస్త్రవేత్త యాన్ లీకాన్ స్పష్టం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత టెక్నాలజీ పైలట్ లేని విమానం వంటిదని, అణుబాంబుతో సమానం అని, మానవ ఉనికిని నాశనం చేస్తుందని ఎలన్ మస్క్ ఇంతకుముందు ఆరోపించారు. ఎలన్ మస్క్‌తోపాటు పలువురు టెక్నాలజీ రంగ నిపుణులు.. చాట్ జీపీటీలతో భవిష్యత్తులో మానవాళి మనుగడకే ముప్పు వాటిల్లుతుందని, వాటి అభివృద్ధిని నిలిపేయాల్సిన అవసరం ఉందంటూ లేఖ రాశారు. ఈ ఆరోపణలను మెటా శాస్త్రవేత్తలు, టెక్నాలజీ నిపుణులు కొట్టి పారేస్తున్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో మానవ మనుగడకు ముప్పు వాటిల్లుతుందన్న అభిప్రాయం కేవలం అపోహ మాత్రమేనని యాన్ లీకాన్ స్పష్టం చేశారు. ఎలన్ మస్క్ ఆరోపణలు పూర్తిగా అవాస్తవం అని తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ వాడుతున్న నిపుణులు తెలివిగా వ్యవహరించాలని, అందుకు అవసరమైన వ్యవస్థను మానవులే డెవలప్ చేస్తారని గుర్తు చేశారు.
ఒక వ్యవస్థను మరో వ్యవస్థ నాశనం చేయాలంటే.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొన్ని వనరులు ఉపయోగించుకోవాల్సి ఉంటుందని.. అందుకు అపరిమిత శక్తి అవసరం అవుతుందన్నారు యాన్ లీకాన్. ఇలా జరుగుతుందని భావించడం పూర్తిగా హాస్యాస్పదం అని స్పష్టం చేశారు. ఏఐ టూల్ ఒక మెరుగైన టెక్నాలజీ టూల్ మాత్రమేనని, ఇది మానవుల్ని నియంత్రిస్తుందన్న ఆలోచన అర్ధరహితం అన్నారు.