Work From Home | కార్పొరేట్ ప్రపంచం మీద కరోనా థర్డ్ వేవ్ ప్రభావం చూపడం మొదలైంది. దేశంలోని కార్పొరేట్ కంపెనీలన్నీ తిరిగి వర్క్ ఫ్రం హోం సేవలను ప్రారంభించాయి. వర్క్ ఫ్రం ఆఫీస్ సేవల పునరుద్ధరణపై ఏప్రిల్ తర్వాతే నిర్ణయం తీసుకోనున్నాయి. దాదాపు ప్రైవేట్ కంపెనీలన్నీ పూర్తిస్థాయిలో వర్క్ ఫ్రం హోం సేవలను అమలు చేయడానికే ప్రాధాన్యం ఇస్తున్నాయి. తొలివేవ్ కరోనా తర్వాత సిబ్బందిని ఆఫీసులకు రప్పించినా.. వెంటనే సెకండ్ వేవ్ ప్రారంభం కాగానే ఆఫీసులను మూసేశాయి. డిసెంబర్ ప్రారంభంలోనే వర్క్ ఫ్రం ఆఫీసు సేవలు మొదలైనా.. థర్డ్ వేవ్ ప్రారంభం కాగానే మళ్లీ వర్క్ ఫ్రం హోం విధానానికి మళ్లిపోయాయి.
ప్రముఖ ఫార్మా సంస్థ సిప్లా తన సిబ్బందిని వర్క్ ఫ్రం హోం సేవలందించాలని గత వారమే కోరింది. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు వర్క్ ఫ్రం హోం విధానం అమలవుతుందని పేర్కొంది. డిసెంబర్ చివరి వారం నుంచే ఐసీఐసీఐ బ్యాంకు అనుబంధ ఐసీఐసీఐ ప్రూడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ కూడా ఇటువంటి ఆదేశాలే జారీ చేసింది.
ప్రముఖ కార్పొరేట్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా తమ సిబ్బంది అందరికీ వర్క్ ఫ్రం హోం అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే మహీంద్రా అండ్ మహీంద్రా మ్యూచువల్ ఫండ్ మాత్రం మూడు రోజులు వర్క్ ఫ్రం హోం.. మూడు రోజులు వర్క్ ఫ్రం ఆఫీసు విధానాన్ని అమలు చేస్తున్నది. వాస్తవంగా మహారాష్ట్రలో ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల కార్యాలయాలు 50 శాతం సిబ్బందితో విధులు నిర్వర్తిస్తున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వోద్యోగుల్లో 50 శాతం మందిని మాత్రమే ఆఫీసులకు రావాలని ఆదేశించింది.
ఆర్పీజీ గ్రూప్, డాబర్ ఇండియా, మారికో, ఫ్లిప్కార్ట్, పార్లే, మేక్ మై ట్రిప్ వంటి సంస్థలు హైఅలర్ట్ జారీ చేశాయి. వచ్చే 2,3 నెలల పాటు వర్క్ ఫ్రం హోం సేవలందించాలని తమ సిబ్బందిని ఆదేశించాయి. ఆర్పీజీ గ్రూప్ మాత్రం కొన్ని నెలల పాటు 50 శాతం సిబ్బందిని ఆఫీసులకు రావాలని కోరింది.
మారికో సంస్థ సిబ్బందిలో 20-25 శాతం ఆఫీసులకు హాజరవుతున్నారు. దేశంలోని ఐటీ కంపెనీల్లో పని చేస్తున్న 45 లక్షల మంది టెక్ నిపుణులు వారానికి మూడు రోజులు ఆఫీసులకు వస్తారని గత నవంబర్లో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ బాడీ నాస్కామ్ అంచనా వేసింది. కానీ, ఒమిక్రాన్ వెలుగులోకి రాగానే అత్యధిక టెక్ సంస్థలు నిర్ణయం మార్చేశాయి. ఆఫీసులకు రావాల్సిన అవసరం లేదని.. వర్క్ ఫ్రం హోం సేవలందించాలని సూచించాయి.
దేశవ్యాప్తంగా మూడో వేవ్ కరోనా కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. ఆదివారంతో ముగిసిన గత వారంలో దేశంలో 1.23 లక్షల కేసులు నమోదయ్యాయి. గత 12 వారాల్లో ఇది అత్యధికం. డిసెంబర్ 20-26 మధ్య 41,169 కేసులు నమోదయ్యాయి. వారంలో మూడు రెట్లు పెరిగాయి.