హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): వ్యాపారం, కార్పొరేట్ ప్రపంచంలోనూ కమ్యూనికేషన్ కీలకపాత్ర పోషిస్తున్నదని నామ్‌ధారీ గ్రూప్ సీఎండీ సూరత్ సింగ్ మల్హోత్రా తెలిపారు. సమర్థవంతమైన కమ్యూనికేషన్ ఆవశ్యకత నేడు ఎంతో ఉందన్నారు. ప్రపంచ కమ్యూనికేటర్స్ దినోత్సవాన్ని పురసరించుకొని పబ్లిక్ రిలేషన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీఆర్సీఐ) హైదరాబాద్ విభాగం సోమవారం థ్రిల్ సిటీలో ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. దీనికి నామ్‌ధారీ గ్రూప్ సీఎండీ, దక్షిణాఫ్రికాలోని లెసో తో కింగ్డమ్ కాన్సుల్ జనరల్ సూరజ్ సింగ్ మల్హోత్రా ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ప్రస్తుతం సమాచార వ్యవస్థకున్న ప్రాధాన్యతను ఈ సందర్భంగా ఆయన వివరించారు. అనంతరం ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ఆర్ పృథ్వీరాజ్.. ‘కంటెంట్ కనెక్ట్స్ కమ్యూనికేషన్ 3సీ’ అనే సబ్జెక్టుపై ప్రసంగించారు. మీడియాతో విశ్వసనీయమైన సంబంధాలను ఏర్పర్చుకోవడానికి.. విషయ నాణ్యత, సంబంధిత అంశాలపై ప్రామాణికమైన సమాచారాన్ని అందించడానికి ప్రజాసంబంధాలు, కార్పొరేట్ కమ్యూనికేషన్ నిపుణుల అవసరం ఉందన్నారు. ఏదైనా సమాచారం, వార్తల సమాహారానికి అంతిమ లక్ష్యం ప్రజలేనన్న ఆయన.. మీడియా మధ్యవర్తిగా మాత్రమే పనిచేస్తుందని గుర్తుంచుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో పీఆర్సీఐ జాతీయ ఉపాధ్యక్షుడు కే రవీంద్రన్, హైదరాబాద్ విభాగం చైర్మన్ షకీల్ అహ్మద్, వైస్ చైర్పర్సన్ జి అనీజ, సెక్రటరీ ఫిలిప్ జాషు వా, జాయింట్ సెక్రటరీ జాకబ్ రాస్ భూం పాగ్, ట్రెజరర్ నోయెల్ రాబిన్సన్తోపాటు సౌత్‌జోన్ హెడ్ టీవీఎస్ నారాయణ్, పబ్లిక్ రిలేషన్స్ నిపుణులు పాల్గొన్నారు.