గోదావరిఖని, సెప్టెంబర్ 26 : బొగ్గు గని కార్మికులకు ప్రతియేటా చెల్లించే లాభాల బోనస్ ఎట్టకేలకు ఖరారైంది. కోల్ ఇండియాలో దసరా పండుగకు ముందు, సింగరేణిలో దీపావళి పండుగకు ముందుగా చెల్లించే పీఎల్ఆర్ బోనస్‌కు సంబంధించి గురువారం అర్ధరాత్రి వరకు జరిగిన చర్చలు కొలిక్కివచ్చాయి. ప్రతి కార్మికుడికి రూ.1,03,000 చెల్లించేందుకు ఐదు జాతీయ కార్మిక సంఘాలతో కోల్ ఇండియా యాజమాన్యం ఒప్పందం చేసుకుంది. గతేడాది రూ.93, 750 బోనస్‌గా చెల్లించారు.
గురువారం కలకత్తాలో జరిగిన సమావేశంలో బోనస్‌ను రూ.1.50 లక్షలకు పెంచాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేసినప్పటికీ, ఈ క్రమంలో రూ.9,250 పెంచేందుకు అంగీకారం కుదిరింది. 2007లో రూ.6 వేల ఉన్న బోనస్ క్రమంగా పెరుగుతూ 2025 నాటికి రూ.1,03,000కు చేరుకుంది. ఈ సమావేశంలో జాతీయ కార్మిక సంఘాలు ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్, బీఎంఎస్, సీఐటీయూ, ఐఎన్టీయూసీలకు చెందిన జేబీ సీసీఐ ప్రతినిధులు పాల్గొనగా, సింగరేణి సంస్థ నుంచి హెచ్ఎంఎస్ సభ్యుడిగా రియాజ్ అహ్మద్, ఐఎన్టీయూసీ ప్రతినిధిగా జనక్‌ప్రసాద్ హాజరయ్యారు.