న్యూఢిల్లీ, నవంబర్ 1: బొగ్గు ఉత్పత్తిలో ప్రపంచంలో అతిపెద్ద సంస్థయైన కోల్ ఇండియా ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. అక్టోబర్లో 56.4 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసినట్టు ప్రకటించింది. కిందటేడాది ఇదే నెలలో ఉత్పత్తి చేసిన 62.5 మిలియన్ టన్నులతో పోలిస్తే 9.8 శాతం తగ్గిందని పేర్కొంది. అకాల వర్షాలు, పండుగ సెలవులు దెబ్బతీశాయి.
కోల్ ఇండియాకు చెందిన సబ్సిడరీ సంస్థలు నిరాశాజనక పనితీరు కనబర్చడం కూడా కారణమే. మరోవైపు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్యకాలంలో కంపెనీ ఉత్పత్తి కూడా 4.5 శాతం తగ్గి 385.5 మిలియన్ టన్నులకు జారుకున్నది. దేశవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న బొగ్గులో కోల్ ఇండియానే 80 శాతం ప్రొడ్యూస్ చేస్తున్నది. ఈ ఆర్థిక సంవత్సరంలో 875 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.