న్యూఢిల్లీ, జూన్ 27: ఆఫీస్ స్పేస్ మార్కెట్లో కో-వర్కింగ్ ఆపరేటర్లు దూకుడును ప్రదర్శిస్తున్నారు. ఈ ఏడాది మొదలు ఇప్పటిదాకా హైదరాబాద్ సహా దేశంలోని 7 ప్రధాన నగరాల్లో రికార్డు స్థాయిలో 8.6 మిలియన్ చదరపు అడుగుల కార్యాలయ స్థలాలను అద్దెకు తీసుకున్నారు మరి. ఫ్లెక్సిబుల్ వర్క్‌స్పేస్‌లకు పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా ఈ స్థలాల్లో కో-వర్కింగ్ ఆపరేటర్లు తమ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారని ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కొల్లియర్స్ ఇండియా తమ తాజా నివేదికలో పేర్కొన్నది. గత ఏడాది జనవరి-జూన్‌లో 6.5 మిలియన్ చదరపు అడుగుల్లో ఆఫీస్ స్పేస్‌ను అద్దెకు తీసుకున్నట్టు తెలిపింది.
35.7 మిలియన్ చదరపు అడుగులకు..
కో-వర్కింగ్ ఆపరేటర్ల జోరు నేపథ్యంలో ఈ ఏడాది జనవరి-జూన్‌లో మొత్తం ఆఫీస్ స్పేస్ లీజింగ్ (లీజ్ రెన్యువల్స్, ప్రీ-కమిట్మెంట్స్, డీల్స్ కాకుండా) 6 శాతం వృద్ధి చెందింది. నిరుడు జనవరి-జూన్‌తో పోల్చితే 35.7 మిలియన్ చదరపు అడుగులకు పెరిగింది. ఏడాది కిందట ఇది 33.7 మిలియన్ చదరపు అడుగులుగానే ఉన్నది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ-ఎన్సీఆర్, కోల్‌కతా, ముంబై, పుణె నగరాల్లో ఆఫీస్ స్పేస్ లీజింగ్ తీరుతెన్నులపై కొల్లియర్స్ రిపోర్టును విడుదల చేసింది. కాగా, ప్రాపర్టీ ఓనర్లు, కార్పొరేట్ల మధ్య నేరుగా జరిగిన ఆఫీస్ స్పేస్ లీజింగ్ మునుపటితో చూస్తే.. ఈసారి స్వల్పంగా తగ్గింది. 27.1 మిలియన్ చదరపు అడుగులుగా ఉన్నది. నిరుడు జనవరి-జూన్‌లో 27.2 మిలియన్ చదరపు అడుగులుగా నమోదైంది. అయితే ఇదే ప్రాపర్టీ ఓనర్లు.. కో-వర్కింగ్ ఆపరేటర్లతో రికార్డు స్థాయిలో 8.6 మిలియన్ చదరపు అడుగుల్లో ఆఫీస్ స్పేస్‌ను లీజింగ్ చేసుకున్నారు. ఏడాది క్రితంతో పోల్చితే ఇది 32 శాతం ఎక్కువ.
బెంగళూరు, ఢిల్లీల్లో..
ఈ జనవరి-జూన్‌లో బెంగళూరు, ఢిల్లీ-ఎన్సీఆర్లలో ఆఫీస్ స్పేస్‌ను తీసుకొనేందుకు కో-వర్కింగ్ ఆపరేటర్లు అమితాసక్తిని ప్రదర్శించారు. ఆ తర్వాత హైదరాబాద్‌లో ఎక్కువగా డిమాండ్ కనిపించింది. ఈ నేపథ్యంలోనే కో-వర్కింగ్ ఆపరేటర్ల ఆఫీస్ స్పేస్ లీజింగ్‌లో ఈ మూడు నగరాల వాటానే మూడింటా దాదాపు రెండు వంతులుగా ఉన్నట్టు కొల్లియర్స్ వెల్లడించింది.
భారతీయ కమర్షియల్ రియల్ ఎస్టేట్ రంగం పునర్నిర్మాణంలో కో-వర్కింగ్ స్పేస్‌లు ప్రధానంగా మారుతున్నాయి. ఫ్లెక్సిబుల్ వర్క్‌స్పేస్‌కు డిమాండ్ ఇకపైనా ఉంటుంది. కార్పొరేట్లు సైతం రియల్ ఎస్టేట్‌ను ఓ తాత్కాలిక అవసరంగా కాకుండా, దీర్ఘకాలిక వ్యూహాత్మక ప్రాధాన్యంగా గుర్తిస్తున్నారు.
-మానస్ మెహ్రోత్రా, 315వర్క్ అవెన్యూ వ్యవస్థాపకుడు
ఫ్లెక్స్ వర్క్‌స్పేస్ మార్కెట్లో కనిపిస్తున్న ఈ బలమైన వృద్ధి.. దేశ స్థితిస్థాపకతకు అద్దం పడుతున్నది. జీసీసీలు, భారత కంపెనీల ఏర్పాటు విషయంలో ఈ ఫ్లెక్సిబుల్ స్పేస్ ముందు వరుసలో ఉంటున్నది. గల్ఫ్‌లో సాధారణ పరిస్థితులు నెలకొంటే.. మార్కెట్ పరుగులు పెట్టగలదు. మరిన్ని పెట్టుబడులకు వీలున్నది.
-ఆశిత్ వర్మ, హంటో వర్క్‌స్పేస్ వ్యవస్థాపకుడు