చెన్నై, ఆగస్టు 19: ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ సిట్రాయిన్..దేశీయ మార్కెట్లోకి మరో మాడల్‌ను పరిచయం చేసింది. ఎస్యూవీ సెగ్మెంట్‌ను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో బాసల్ట్ పేరుతో నయా కారును అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆరు రకాల్లో లభించనున్న ఈ కారు రూ.7.99 లక్షల నుంచి రూ.13.62 లక్షల ధరల శ్రేణిలో లభించనున్నది. ఈ ధరలు చెన్నై షోరూంనకు సంబంధించినవి. ఈ కారుపై రెండేండ్లు లేదా 40 వేల కిలోమీటర్ల వ్యారెంటీ కల్పిస్తున్నది. దేశవ్యాప్తంగా ఉన్న 85 షోరూంలలో ఈ కారు ముందస్తు బుకింగ్‌లు ఆరంభించిన సంస్థ..వచ్చే నెల తొలి వారం నుంచి డెలివరీ చేయనున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. 1.2 లీటర్ జెన్ 3 ప్యూర్‌టెక్ 110 టర్బో ఇంజిన్‌తో తయారైన ఈ కారు 6 స్పీడ్ ఆటోమేటిక్, మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో తయారు చేసింది. భద్రత ప్రమాణాలు మెరుగుపర్చడంలో భాగంగా ఈ కారులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను నెలకొల్పింది.