Citigroup Lay-offs | ప్రముఖ ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ సంస్థ ‘సిటీ గ్రూప్’ మరోదఫా ఉద్యోగుల ఉద్వాసనకు రంగం సిద్ధం చేస్తోంది. బ్యాంకులోని వివిధ విభాగాల మేనేజింగ్ డైరెక్టర్లతో కాన్ఫరెన్స్ కాల్ ద్వారా సీఈఓ జాన్ ప్రాసెర్ చర్చించారు. ఈ సంప్రదింపుల్లో పూర్తిస్థాయిలో బ్యాంకును పునర్వ్యవస్థీకరించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. వేర్వేరు సంప్రదింపుల్లో మార్కెట్ మేనేజర్లు, రిస్క్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ విభాగాలు రద్దు చేస్తారని సమాచారం. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి కొందరు మేనేజర్లను తొలగిస్తున్నట్లు ఈ చర్చల్లో సంకేతాలిచ్చినట్లు తెలుస్తున్నది. ఉద్వాసనకు గురైన ఎగ్జిక్యూటివ్లకు పరిహారం చెల్లింపుపై వచ్చేవారం ప్రకటన చేస్తారని సిటీ గ్రూప్ వర్గాలు తెలిపాయి.
వచ్చే రెండేండ్లలో 20 వేల మందిని తొలగించాలని గతవారం సిటీ గ్రూప్ వెల్లడించింది. తాజా ఉద్వాసనల్లో 5,000 మంది, సెల్లింగ్ బిజినెస్ నుంచి మరో 5,000 మందిని తొలగిస్తారని సీఈఓ జాన్ ఫ్రాజర్ ను ఉటంకిస్తూ బ్యాంక్ వర్గాలు చెబుతున్నాయి. టెక్నాలజీ అండ్ ఆపరేషన్స్ విభాగాల్లో మరో పది వేల మందిని తొలగించనున్నట్లు ఆ వర్గాల కథనం. నాలుగో త్రైమాసికంలో 180 కోట్ల డాలర్ల నష్టం వాటిల్లిన నేపథ్యంలో ఉద్వాసనలు మరింత పెరుగుతాయని సమాచారం.