హైదరాబాద్, జనవరి 6(నమస్తే తెలంగాణ) : సెమీకండక్టర్ పరిశ్రమలకు అవసరమైన విడిభాగాలు, ఆటోమేషన్ పరికరాల తయారీ సంస్థ పీటీడబ్ల్యూ..హైదరాబాద్‌లో రూ.1,000 కోట్ల పెట్టుబడితో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. ఈ భారీ పెట్టుబడితో ఏర్పాటు చేయతలపెట్టిన ఉత్పాదక కేంద్రం మొదటి దశకు తాము సిద్ధంగా ఉన్నట్లు పీటీడబ్ల్యూ ఆసియా విభాగ ఎండీ టార్ స్టెన్ సెయ్ ఫ్రైడ్ పేర్కొన్నారు. ఈ యూనిట్ ఏర్పాటునకు సంబంధించి సోమవారం సచివాలయంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో ప్రత్యేకంగా సమావేశమై వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..సెమీ కండక్టర్(చిప్)ల తయారీ, దాని అనుబంధ పరిశ్రమలకు అనుకూల వాతావరణం హైదరాబాద్‌లో ఉన్నదని వెల్లడించారు. పరిశ్రమ ఏర్పాటు చేసే పక్షంలో ప్రభుత్వ విధానాల ప్రకారం రాయితీలు, ప్రోత్సాహకాలు అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చారు. ఇకడ నైపుణ్యం కలిగిన మానవ వనరులకు కొదవ లేదని, సరైన ప్రతిపాదనలతో వస్తే తమ ఆహ్వానం ఎప్పటికీ ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో సంస్థ స్థానిక భాగస్వామి బార్ ట్రానిక్స్ ఎండీ విద్యాసాగర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.