BYD | న్యూఢిల్లీ, అక్టోబర్ 14: చైనాకు చెందిన ఈవీ కంపెనీ బీవైడీ.. భారతీయ మార్కెట్లో పట్టు సాధించేందుకు రూటు మార్చింది. బిలియన్ డాలర్ల పెట్టుబడితో దేశీయంగా ఓ ఉత్పాదక కేంద్రాన్ని పెట్టాలనుకున్నప్పటికీ.. కేంద్ర ప్రభుత్వం అనుమతిని నిరాకరించింది. దీంతో ఇక దిగుమతులపైనే ఆధారపడి ఇక్కడ వ్యాపారాన్ని విస్తరించాలని నిర్ణయించుకున్నది. కొత్త ఈవీ పాలసీ కింద మోదీ సర్కారు బీవైడీ ప్లాంట్‌కు నో చెప్పిన విషయం తెలిసిందే.
హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న మేఘా ఇంజినీరింగ్‌తో కలిసి ఈవీల తయారీ ఫ్యాక్టరీని తేవాలని బీవైడీ చూసిన సంగతి విదితమే. కానీ చైనాతో భారత్‌కున్న విభేదాలు, సరిహద్దు సమస్యల నడుమ లైన్ క్లియర్ అవ్వలేదు. కాగా, ఇతర దేశాల నుంచి దిగుమతి అవుతున్న వాహనాలపై పెద్ద ఎత్తున దిగుమతి సుంకాలు పడుతున్నాయి. దీంతో విదేశీ కంపెనీల వాహనాల ధరలు దేశీయ మార్కెట్లో ఎక్కువైపోతున్నాయి. ఈ క్రమంలో భారత్‌లోనే ఈవీల తయారీకి బీవైడీ ముందుకొచ్చింది. ఇక్కడ ప్లాంట్ పెడితే అందులో తయారయ్యే వాహనాల ధరలు తగ్గుతాయని, మరింత పోటీనివ్వవచ్చని బీవైడీ భావించింది. కానీ పొరుగు దేశాలతో వాణిజ్యం విషయంలో కేంద్రం అనుసరిస్తున్న పాలసీతో కుదరలేదు.