హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): దేశీయ ఆటోమొబైల్, ఈవీ (ఎలక్ట్రిక్ వాహనాలు), క్లీన్ ఎనర్జీ తదితర రంగాలు తీవ్ర గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. రేర్ ఎర్త్ మెటల్స్ (అరుదైన లోహాల) ఉత్పత్తుల ఎగుమతిపై చైనా ఆంక్షలు విధించడమే ఇందుకు కారణం. రేర్ ఎర్త్ మెటల్స్ ఉత్పత్తుల తయారీలో అగ్రగామిగా ఉన్న చైనా మార్కెట్లో తన గుత్తాధిపత్యాన్ని కొనసాగిస్తుండటంతో దేశీయ పరిశ్రమలకు మరో ప్రత్యామ్నాయం కనిపించడంలేదు.
స్మార్ట్ఫోన్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, రక్షణ సామగ్రి, విండ్ టర్బైన్ల తయారీతోపాటు విస్తృతశ్రేణి హైటెక్, క్లీన్ ఎనర్జీ తదితర రంగాలకు రేర్ ఎర్త్ మెటల్స్ ఉత్పత్తులు ఎంతో కీలకం. ఈ లోహాల తయారీకి ఉపయోగించే ఖనిజాల మైనింగ్, ప్రాసెసింగ్, సరఫరాలో అగ్రగామిగా ఉన్న చైనా.. ప్రపంచ మార్కెట్లో దాదాపు 90% వాటా కలిగి ఉన్నది. గత కొన్నేండ్ల నుంచి ప్రపంచవ్యాప్తంగా విద్యుత్తు వాహనాల వాడకం, గ్రీన్ ఎనర్జీ తయారీ అధికమవడంతో రేర్ ఎర్త్ మెటల్స్ ఉత్పత్తులకు గిరాకీ విపరీతంగా పెరిగింది.
దీంతో ప్రపంచమంతా తమపైనే ఆధారపడుతున్నదని తెలుసుకున్న చైనా ఇటీవల ఆ ఉత్పత్తుల ఎగుమతిపై ఆంక్షలు విధించింది. ఫలితంగా ప్రపంచమంతటా ఈవీ, గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్స్ తదితర రంగాలు దిక్కుతోచని స్థితిలో పడ్డాయి. అయితే, రేర్ ఎర్త్ మెటల్స్ ఉత్పత్తుల్లో చైనా గుత్తాధిపత్యాన్ని తగ్గించేందుకు అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా తదితర దేశాలు తమ ప్రాంతాల్లో సొంతంగా అరుదైన ఖనిజాల మైనింగ్‌ను చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాయి.
రేర్ ఎర్త్ మెటల్స్ ఉత్పత్తుల కోసం మన దేశంలోని పరిశ్రమలు పూర్తిగా చైనా పైనే ఆధారపడుతున్నాయి. 2024-25లో సుమారు 30 మిలియన్ డాలర్ల విలువైన 700 టన్నుల ఉత్పత్తులను దిగుమతి చేసుకున్నట్టు పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి. ముఖ్యంగా దేశీయ ఈవీ, గ్రీన్ ఎనర్జీ, కన్జ్యూమర్ గూడ్స్ తదితర పరిశ్రమలకు ఏటేటా చైనా నుంచి దిగుమతులు గణనీయంగా పెరుగుతున్నాయి. కానీ, పెట్రో ఉత్పత్తుల మాదిరిగా రేర్ ఎర్త్ మెటల్స్ ఉత్పత్తులకు ప్రపంచంలో మరో ప్రత్యామ్నాయం లేకపోవడం, దీన్ని అదునుగా చేసుకుని చైనా ఒక్కసారిగా ఆంక్షలు అమల్లోకి తేవడంతో దేశీయ పరిశ్రమలు విలవిల్లాడుతున్నాయి.
రేర్ ఎర్త్ మెటల్స్ ఉత్పత్తులను తయారుచేసే సామర్ధ్యం తమకు ఉన్నదని ప్రభుత్వ రంగంలోని ఐఆర్ఈఎల్తోపాటు మిడ్వెస్ట్ అడ్వాన్స్డ్ మెటీరియల్స్, ఎంటెల్లస్ ఇండస్ట్రీస్ తదితర సంస్థలు ఇప్పటికే భారీ పరిశ్రమల శాఖకు తెలియజేశాయి. కాగా, కేంద్ర ప్రభుత్వం ఓవైపు దేశీయంగా రేర్ ఎర్త్ మెటల్స్ ఉత్పత్తుల తయారీపై దృష్టి పెడుతూనే మరోవైపు వాటి ఎగుమతులపై ఆంక్షలు సడలించేలా చైనాను ఒప్పించేందుకు దౌత్యపరంగా కృషిచేస్తున్నట్టు పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి.
రేర్ ఎర్త్ మెటల్స్ ఉత్పత్తుల తయారీ కోసం చైనా ఎక్కువగా మయన్మార్ నుంచి ముడి ఖనిజాలను దిగుమతి చేసుకుంటున్నది. అలా 2023లో 42 వేల మెట్రిక్ టన్నుల ముడిసరుకును దిగుమతి చేసుకున్నట్టు సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్‌కు చెందిన సెంట్రల్ మినరల్స్ సెక్యూరిటీ ప్రోగ్రామ్ వర్గాలు చెప్తున్నాయి. ఇదే విధంగా మనం కూడా మయన్మార్ నుంచి రేర్ ఎర్త్ మెటల్స్ ఉత్పత్తుల తయారీకి అవసరమైన ముడి ఖనిజాలను దిగుమతి చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆ వర్గాలు కోరుతున్నాయి.