Interest Rate | న్యూఢిల్లీ, జూన్ 12: డిపాజిట్లపై వడ్డీరేట్లు పతాకస్థాయికి చేరుకున్నాయని, స్వల్పకాలంలో ఈ రేట్లు తగ్గే అవకాశం ఉన్నదని ఎస్బీఐ చైర్మన్ దినేశ్ కుమార్ ఖారా తెలిపారు. అలాగే రిజర్వు బ్యాంక్ కూడా వడ్డీరేట్లను కూడా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం నుంచి తగ్గించే అవకాశాలున్నాయని ఆయన పేర్కొన్నారు. గత వారం లో తన పరపతి సమీక్షలో ఆర్బీఐ వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
ఈ ఏడాది మూడో త్రైమాసికం నుంచి రిటైల్ ధరల సూచీ నాలుగు శాతం దిగువకు తగ్గే అవకాశం ఉండటంతో ఆర్బీఐ వడ్డీరేట్లను తగ్గించేందుకు ఆస్కారం ఉంటుందని ఆయన చెప్పారు. ఇప్పటికే పలు దేశాల సెంట్రల్ బ్యాంకులు వడ్డీరేట్లను తగ్గించాయని, వీటిలో స్విట్జర్లాండ్, స్వీడన్, కెనడా, యూరో దేశాలు తగ్గించిన విషయం తెలిసిందే. మరోవైపు, గత నెలలో ఎస్బీఐ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను 75 బేసిస్ పాయింట్ల వరకు పెంచిన విషయం తెలిసిందే.