IT | న్యూఢిల్లీ, ఆగస్టు 17: దేశవ్యాప్తంగా పెద్దమొత్తంలో జరిగే నగదు లావాదేవీలపై కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఆందోళన వ్యక్తంచేసింది. ముఖ్యంగా హోటళ్లు, లగ్జరీ బ్రాండ్ విక్రయ స్టోర్లు, హాస్పిటళ్లు, ఐవీఎఫ్ క్లినిక్స్ల్లో పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలు జరుగుతున్నాయని, వాటిపై దృష్టి సారించాలని ఆదాయ పన్ను మంత్రిత్వ శాఖకు కీలక సూచన చేసింది కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ). 2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను సీబీడీటీ విడుదల చేసిన వార్షిక ప్రణాళికలో ఈ విషయాన్ని స్పష్టంచేసింది.
సాధారణంగా రూ.2 లక్షలకు పైబడి నగదు లావాదేవీలు జరిగితే ఆ వివరాలు ఆర్థిక సంస్థలకు నివేదించాల్సి ఉంటుందని సీబీడీటీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కానీ నిబంధనలను అతిక్రమించి పెద్ద మొత్తంలో లావాదేవీలు జరుగుతున్నాయని, వీటిపై ప్రధానంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నదని ఐటీ శాఖకు సూచించింది.
అలాగే పెద్ద మొత్తంలో జరిగే ఆర్థిక లావాదేవీలకు ఖచ్చితంగా పాన్ కార్డు జత చేయాల్సి ఉండగా, వీరు ఎలాంటి కార్డు వివరాలు ఇవ్వకుండానే జరుపుతున్నారని, దీనివల్ల ఆదాయ పన్ను శాఖకు భారీ నష్టం జరుగుతున్నదని, వీటిని మోస పూరిత లావాదేవీలుగా గుర్తించి వీటిపై చర్యలు తీసుకోవాలని సూచించింది.