ముంబై, జూలై 30: ఉద్దేశ పూర్వక ఎగవేతదారులకు రిజర్వు బ్యాంక్ మరో షాకిచ్చింది. ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సెంట్రల్ బ్యాంక్ తాజాగా.. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు రూ.25 లక్షలు అంతకంటే ఎక్కువ మొత్తంలో ఉన్న అన్ని నిరర్థక ఆస్తుల ఖాతాల్లో ఉద్దేశ పూర్వక ఎగవేతదారుల అంశాన్ని పరిశీలించాలని మంగళవారం ప్రత్యేక సూచనలు చేసింది. ప్రస్తుతం రుణాలను తీసుకున్న వారు తిరిగి చెల్లింపులు జరపలేకపోతే వారిని ఉద్దేశపూర్వక డిఫాల్టర్‌గా ప్రకటించడం జరుగుతున్నది.
రూ.25 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ రుణం తీసుకొని ఎగ్గొట్టిన వారు లేదా వీరికి గ్యారెంటీగా ఉన్నవారు కూడా విల్‌ఫుల్ డిఫాల్టర్‌గా గుర్తించనున్నారు. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీల్లో ఉన్న అన్ని నిరర్థక ఆస్తుల ఖాతాలకు సంబంధించి తిరిగి రుణాలు ఆరు నెలల్లో చెల్లింపులు జరపకపోనటువంటి ఖాతాలను విల్‌ఫుల్ డిఫాల్టర్‌గా గుర్తించనున్నారు. వీటిని గుర్తించేటప్పుడు అంతర్గతంగా పరిశీలించిన తర్వాతనే ఆ ఖాతాలను ఎన్పీఏగా ప్రకటిస్తారు.