ముంబై, డిసెంబర్ 24 : సత్వర చెక్ క్లియరెన్స్ విధానం రెండో దశ అమలును బుధవారం ఆర్బీఐ వాయిదా వేసింది. బ్యాంక్ కార్యకలాపాల క్రమబద్ధీకరణకు మరింత సమయం ఇవ్వాలనే ఈ నిర్ణయం తీసుకున్నది. నిజానికి రెండో దశ ‘కంటిన్యూయస్ క్లియరింగ్ అండ్ సెటిల్మెంట్ ఆన్ రియలైజేషన్ ఇన్ చెక్ ట్రంకేషన్ సిస్టమ్’ జనవరి 3 నుంచి బ్యాంకుల్లో అమల్లోకి రావాల్సి ఉన్నది. అయితే ఈ ఏడాది అక్టోబర్ 4న మొదలైన మొదటి దశ అమల్లోనే అనేక సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో రెండో దశ అమల్లో ఆ పరిస్థితి రాకూడదనే బ్యాంకులకు మరింత సమయాన్ని ఆర్బీఐ ఇచ్చింది.
ఎందుకంటే రెండో దశ కింద చెక్ ట్రంకేషన్ సిస్టమ్‌లో 3 గంటల్లోపే చెక్కులను బ్యాంకులు క్లియర్ చేయాల్సి ఉంటుంది మరి. కాగా, తదుపరి ఆదేశాలు ఇచ్చేదాకా ఈ రెండో దశ అమలు వాయిదానేనని ఆర్బీఐ ఓ ప్రకటనలో పేర్కొన్నది. ఇక చెక్ సమర్పించే సమయాన్ని ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మార్చారు. అలాగే కన్ఫర్మేషన్ సెషన్ టైమ్‌ను ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మార్చారు. ఈ ఏడాది ఆగస్టులో ఈ నూతన వ్యవస్థను ఆర్బీఐ పరిచయం చేసింది. అప్పట్లో చెక్ క్లియరెన్స్‌కు రెండు పనిదినాల సమయం పట్టేదన్న విషయం తెలిసిందే.