ChatGPT | జాతీయంగా, అంతర్జాతీయంగా తెలియని సమాచారం కోసం గూగులమ్మను అడుగుతాం. ఇప్పుడు ఏఐ చాట్‌జీపీటీ వచ్చిన తర్వాత గూగులమ్మకు ప్రాధాన్యం తగ్గింది. ప్రతి ఒక్కరూ చాట్‌జీపీటీనే ఆశ్రయిస్తున్నారు. భారతీయ ఇంటర్నెట్ యూజర్లలో మెజారిటీ ఓపెన్ఏఐ చాట్‌జీపీటీతోనే కొత్త విషయాలు తెలుసుకుంటున్నారని ఓ ఆన్లైన్ సర్వేలో తేలింది. గూగుల్, ఇతర సెర్చింజన్లలో సుమారు 40 శాతం మంది యూజర్లు సమాధానాలు వెతుక్కుంటున్నట్లు లోకల్ సర్కిల్ అనే సంస్థ అధ్యయనంలో పాల్గొన్న వ్యక్తులు చెప్పారు.
గతేడాది ఆగస్టు 11 నుంచి ఈ నెల ఒకటో తేదీ వరకూ జరిగిన సర్వేలో 309 జిల్లాల నుంచి 92 వేల మందికి పైగా పాల్గొన్నారు. సర్వేలో పాల్గొన్న వారిలో 28 శాతం.. అంటే 15,377 మంది యూజర్లు చాట్‌జీపీటీ వాడుతున్నట్లు తొమ్మిది శాతం మంది పర్ప్లెక్సిటీ, ఆరు శాతం బింగ్ ద్వారా కో పైలట్, మూడు శాతం మంది గూగుల్ ద్వారా జెమినీ చాట్‌బోట్, ఆరు శాతం మంది ఎల్ఎల్మా వినియోగిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఇద్దరిలో ఒకరు ఏఐ ప్లాట్‌ఫామ్ చాట్బోట్లను వినియోగిస్తున్నారు.
కొత్తగా చైనా రూపొందించిన డీప్‌సీక్ ప్లాట్‌ఫామ్ వైపు ఏఐ చాట్‌జీపీటీ యూజర్లలో ఎనిమిది శాతం మళ్లిపోయారు. మొత్తం ఏఐ బేస్డ్ చాట్బోట్ల యూజర్లలో ప్రతి పది మందిలో ముగ్గురు డీప్‌సీక్ ప్లాట్‌ఫామ్ వినియోగిస్తున్నారు. మూడోవంతు యూజర్లు సబ్స్క్రైబ్డ్ ఏఐ ప్లాట్‌ఫామ్స్ వాడుతున్నారు.