ChatGPT | ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) బేస్డ్ చాట్‌బోట్ చాట్‌జీపీటీ (ChatGPT) సేవల్లో అంతరాయం ఏర్పడింది. ఫలితంగా లక్షలాది మంది యూజర్లు చాట్‌జీపీటీ సేవలు లభించక పోవడంతో ఇబ్బందుల పాలవుతున్నారు. దీనిపై యూజర్లకు ‘ఎక్స్ (మాజీ ట్వి్ట్టర్)’ వేదికగా క్షమాపణ చెప్పిన ఓపెన్ ఏఐ.. సమస్య గుర్తించామని, దాని పరిష్కారానికి ప్రయత్నిస్తున్నామని తెలిపింది. త్వరలోనే చాట్‌జీపీటీ గ్లోబల్ ఔటేజ్‌పై అప్డేట్ ఇస్తామని పేర్కొంది. స్థానిక కాలమానం ప్రకారం గురువారం తెల్లవారు జాము నుంచి చాట్‌జీపీటీ సేవల్లో అంతరాయం ఏర్పడింది. చాట్‌జీపీటీతోపాటు సంస్థకు చెందిన ఏపీఐ, సోరా సేవల్లో ఈ సమస్య తలెత్తిందని ఓపెన్ ఏఐ తెలిపింది. అయితే, ఎప్పటిలోగా సమస్య పరిష్కారం అవుతుందో వెల్లడించలేదు. దీనివల్ల ఓపెన్ ఏఐ చాట్‌జీపీటీపై ఆధార పడిన సంస్థల కార్యకలాపాలపై ప్రభావం పడుతుందని చెబుతున్నారు.
2022 చివర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారంగా పని చేసే చాట్‌జీపీటీని ఓపెన్ ఏఐ అందుబాటులోకి తెచ్చింది. ఈ చాట్‌బోట్ సాయంతో యూజర్లు తమకు అవసరమైన ఖచ్చితమైన సమాచారాన్ని సెకన్లలోనే అందుకోవచ్చు. కాగా, బుధవారం రాత్రి మెసేజింగ్ యాప్ వాట్సాప్‌తోపాటు ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ సేవల్లో అంతరాయం నెలకొంది. సాంకేతిక లోపం వల్ల యూజర్లు తమ యాప్స్ సేవలు ఉపయోగించుకోలేదని మెటా పేర్కొంది. సాధ్యమైనంత త్వరగా సేవలు పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్నామని వివరించింది.