Chandrayaan-3 | చంద్రయాన్-3 పనితీరు, భవితవ్యంపై ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రయాన్-3, ప్రజ్ఞాన్ రోవర్ అంచనాలకు అనుగుణంగా పని చేసిందన్నారు. ప్రస్తుత స్లీప్ మోడ్ నుంచి మేల్కొల్పేందుకు చేసే ప్రయత్నాలు విఫలమైనా సమస్య కాదన్నారు.
గురువారం ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్.. గుజరాత్‌లోని గిర్ సోమనాథ్ జిల్లాలో ప్రసిద్ధి చెందిన సోమనాథ్ ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన తర్వాత ఎస్ సోమనాథ్ మీడియాతో మాట్లాడారు. నవంబర్‌లో గానీ, డిసెంబర్లో గానీ ఎక్స్‌పోశాట్ లేదా ఎక్స్-రే పీఎస్ఎల్వీని ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు.
పూర్తిగా శీతల వాతావరణం నెలకొన్న చంద్రమండలంపై ప్రస్తుతం స్లీప్ మోడ్‌లో ఉన్న ప్రజ్ఞాన్ రోవర్‌లోని ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ దెబ్బ తినకపోతే దాన్ని మేల్కోల్పవచ్చునని సోమనాథ్ తెలిపారు. చంద్రుడిపై ప్రస్తుతం దాదాపు మైనస్ 200 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నెలకొని ఉంది.
చంద్రుడిపై రాత్రి కావడంతో విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్లను ఈ నెల నాలుగో తేదీన స్లీపింగ్ మోడ్ లోకి పంపించింది ఇస్రో. తర్వాత విక్రం లాండర్, ప్రజ్ఞాన్ రోవర్ లను మేల్కొల్పేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదన్నారు ఎస్ సోమనాథ్.