న్యూఢిల్లీ, జూన్ 23 : మరో ప్రభుత్వరంగ సంస్థలో వాటా విక్రయించడానికి మోదీ సర్కార్ సిద్ధమైంది. తాజాగా ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్(ఐఆర్ఎఫ్సీ)లో తనకున్న వాటాల్లో రెండు శాతం వాటాను విక్రయించబోతున్నట్టు మంగళవారం ప్రకటించింది. ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) రూట్లో షేరుకు రూ.91 చొప్పున 26.13 కోట్ల షేర్లను బహిరంగ మార్కెట్లో బుధవారం నుంచి విక్రయించబోతున్నది. రెండు రోజుల పాటు కంపెనీ షేర్లను విక్రయించడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.2,300 కోట్ల నిధుల జమకానున్నాయి.
ప్రస్తుత సంవత్సరంలో ఐదు ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాలను విక్రయించడంతో రూ.16,480 కోట్ల నిధులను సమీకరించింది. వీటిలో కోల్ ఇండియా రూ.5,542 కోట్లు రాగా, ఎన్‌హెచ్‌పీసీలో రూ.4,357 కోట్లు, జీఐసీలో రూ.3,090 కోట్లు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రూ.2,266 కోట్లు, ఎన్ఎల్సీ ఇండియాలో వాటా విక్రయంతో రూ.1,223 కోట్ల నిధులు సమకూరాయి.