Seat Belt Reminder | కారు ప్రయాణికుల సేఫ్టీ కోసం కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నది. కారు ఫ్రంట్ సీటులో కూర్చున్న ఇద్దరికి సీట్ బెల్ట్ రిమైండర్ ఇన్‌స్టల్ చేయాలని సిఫారసు చేసింది. సీట్ బెల్ట్ రిమైండర్ ఇన్స్టలేషన్ వల్ల ప్యాసింజర్ సేఫ్టీని ప్రోత్సహించడమే అవుతుంది. కార్లలో ఆటోమోటివ్ ఇండస్ట్రీ స్టాండర్డ్ (ఏఐఎస్)లో భాగంగా అదనపు భద్రతా ఫీచర్ల కోసం కేంద్రం ఈ సిఫారసు చేసింది.
దీనిపై వచ్చేనెల ఐదో తేదీ వరకు ప్రజలు తమ అభిప్రాయాలను తెలియజేయొచ్చు. ఇటీవలే గుజరాత్ నుంచి ముంబైకి వస్తూ టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ రోడ్డు ప్రమాదంలో హఠాన్మరణం పాలైన నేపథ్యంలో కార్లలో సీట్ బెల్ట్ రిమైండర్స్కు ప్రాధాన్యం పెరిగింది.
కార్లలో సీట్ బెల్ట్ రిమైండర్ ఇన్స్టలేషన్ కోసం ప్రతిపాదించిన సవరణను కార్ల తయారీ సంస్థలు, టెస్టింగ్ ఏజెన్సీలు తగు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. సైరస్ మిస్త్రీ మరణం చాలా దురదృష్టకరం.. ఆ ఘటన తనను షాక్‌కు గురి చేసిందని కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే సేఫ్టీ ప్రమాణాలు గల కార్లను విక్రయించాలని, ప్రమాదాలను తగ్గించడానికి వీలుగా రోడ్ల నిర్మాణం మెరుగు పర్చాలని తాను ప్రతిపాదిస్తున్నానని చెప్పారు.
ఫ్రంట్ సీట్లో సహ ప్రయాణికుడు సీట్ బెల్ట్ పెట్టుకోకుంటే, డ్రైవర్‌ను అలర్ట్ చేసేలా సేఫ్టీ బెల్ట్ రిమైండర్ సిస్టమ్ పని చేస్తుంది. సీట్‌బెల్ట్ పెట్టుకోని విషయాన్ని రిమైండర్ డ్రైవర్‌ను రెండు స్థాయిల్లో హెచ్చరిస్తూనే ఉంటుంది.