శనివారం 27 ఫిబ్రవరి 2021
Business - Feb 10, 2021 , 03:18:52

అంతా డొల్లే.. గుద్దితే గుల్లే

అంతా డొల్లే.. గుద్దితే గుల్లే

  • భద్రతా ప్రమాణాలకు ఉద్దేశపూర్వకంగా తిలోదకాలు
  • ఆటోమొబైల్‌ కంపెనీల తీరుపై కేంద్రం ఆందోళన
  • అక్రమ విధానాలకు స్వస్తి పలకాలని హితవు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: దేశంలో పలు ఆటోమొబైల్‌ కంపెనీలు ఉద్దేశపూర్వకంగా తమ వాహనాల్లో భద్రతా ప్రమాణాలను తగ్గించి అమ్ముతున్నట్లు వస్తున్న వార్తలపై కేంద్ర ప్రభుత్వం ఆదోళన వ్యక్తం చేసింది. ఇది ఏమాత్రం క్షమించరాని విషయమని, ఇలాంటి అక్రమ విధానాలకు ఇకనైనా స్వస్తి పలకాలని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (ఎంఓఆర్‌టీహెచ్‌) కార్యదర్శి గిరిధర్‌ అరమానే హితవు పలికారు. రోడ్లపై భద్రతను పెంపొందించేందుకు వెహికల్‌ లొకేషన్‌ ట్రాకింగ్‌ డివైజ్‌లను ప్రవేశపెట్టడంపై ఆటోమొబైల్‌ పరిశ్రమల సంఘం ‘సియామ్‌' మంగళవారం ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో అరమానే మాట్లాడుతూ.. కేవలం కొన్ని ఆటోమొబైల్‌ కంపెనీలు మాత్రమే వాహన భద్రతా రేటింగ్‌ వ్యవస్థ ప్రమాణాలను అనుసరిస్తున్నాయని, అది కూడా ఆయా కంపెనీల హై-ఎండ్‌ మోడళ్ల వాహనాలకు మాత్రమే పరిమితమవుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘పలు ఆటోమొబైల్‌ కంపెనీలు భారత మార్కెట్లో అమ్ముతున్న వాహనాల్లో ఉద్దేశపూర్వకంగా భద్రతా ప్రమాణాలను తగ్గిస్తున్నట్లు వస్తున్న వార్తలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఇలాంటి విధానాలకు వెంటనే స్వస్తి పలకాల్సిన అవసరమున్నది. రోడ్డు భద్రతలో కీలకపాత్ర పోషించాల్సింది వాహన తయారీదారులే. ఉత్తమ నాణ్యతా ప్రమాణాలు కలిగిన వాహనాలను దేశీయ మార్కెట్‌లో అందుబాటులో ఉంచడంలో ఆటోమొబైల్‌ కంపెనీలు ఏమాత్రం రాజీ పడకూడదు. వాహనాల్లో భద్రతా ప్రమాణాలను ఉద్దేశపూర్వకంగా తగ్గించి అమ్మాలనుకునే కంపెనీలను క్షమించే ప్రసక్తే లేదు’ అని ఆయన స్పష్టం చేశారు. కస్టమర్లు కొనుగోలు చేస్తున్న వాహనాలు ఎలాంటివో, వాటి వల్ల ఎదురయ్యే సమస్యలేమిటో వారికి ముందుగానే తెలిసేలా చూసేందుకు ఆటోమొబైల్‌ కంపెనీలన్నీ తమ వాహనాలకు సేఫ్టీ రేటింగ్స్‌ పొందడం చాలా ముఖ్యమని అరమానే సూచించారు. 

VIDEOS

logo